Asianet News TeluguAsianet News Telugu

వధువుకు కన్యత్వ పరీక్ష.. ఫెయిలయ్యిందని రూ.10లక్షల జరిమానా.. ఆ తరువాత...

రాజస్థాన్ లో ఘోర ఘటన వెలుగుచూసింది. కన్యత్వ పరీక్షలో విఫలమయ్యిందని.. ఓ భర్త, అత్తామామలు నవవధువుకు నరకం చూపించారు. ఆ తరువాత పదిలక్షల జరిమానా విధించారు. 

Bride fined Rs 10 lakh for failing virginity test In Rajasthan
Author
First Published Sep 5, 2022, 8:40 AM IST

రాజస్థాన్ : రాజస్థాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ నవవధువుకు అత్యంత అవమానకరమైన సందర్బం ఎదురయ్యింది. కొత్తగా పెళ్లై.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురయింది. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో భర్త, అత్తమామలు దారుణానికి ఒడిగట్టారు. తన కన్యత్వాన్ని బజారుకీడ్చారు. పంచాయతీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షలు జరిమానా విధించారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లాలో మే11వ తేదీన బాధితురాలు (24)కు బాగోర్ కు చెందిన ఒక వ్యక్తి తో వివాహం జరిగింది. కాగా, వారి సంప్రదాయం ప్రకారం.. ‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వగా పరీక్షలో వధువు విఫలమయింది. దీంతో అత్తింటివారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత దీనిపై వధువును నిలదీయడంతో వరుడి గుండెలు బద్దలయ్యే విషయం చెప్పింది. పెళ్లికి ముందు తన ఇంటివద్దే ఉండే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పుకొచ్చింది.

సైరస్ మిస్త్రీ మృతి : ప్రమాద సమయంలో అతివేగంతో కారు నడిపింది ఆమెనట..!

దీంతో ఆగ్రహానికి లోనైన తన భర్త, అత్తామామలు ఆమెను చితకబాదారు. ఆ తర్వాత ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. దీంతో,  పంచాయతీ పెద్దలు.. వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతో పాటు ఆమె కుటుంబాన్ని అత్తింటివారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. దీంతో, వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వధువు భర్త, మామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
రాజస్థాన్ లో సాంసీ సమాజంలో కుక్డీ ఆచారం ఉంది. దీని ప్రకారం మహిళలు తమ కన్యత్వాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లయిన మొదటి రాత్రి..  భర్త తన భార్య కోసం ఓ షీట్ తెస్తాడు. ఇద్దరూ కలిసిన తర్వాత ఆ షీట్ పై రక్తపు మరకలు పడాలి. ఆ రక్తపు మరకలను మరుసటి రోజు సమాజంలోని ప్రజలకు చూపించాలి. రక్తపు మరకలు ఉంటే.. అతని భార్య పవిత్రంగా ఉందని అందరూ భావిస్తారు. ఒకవేళ దాని మీద రక్తపు మరకలు లేకపోతే కమ్యూనిటీ పంచాయతీ అమ్మాయి కుటుంబం నుంచి మరింత కట్నం డిమాండ్ చేస్తుంది. 

కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతటి అనాగరికమైన ఆచారాన్ని, సంప్రదాయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ ఆచారానికి ఆయా సమాజంలో ఆమోదం లభిస్తుంది. దీంతో అమ్మాయిలపై వేధింపులు కొనసాగుతున్నాయి. కన్యత్వం, శీలపరీక్షలతో యువతులు నలిగిపోతున్నారు. దీనిపై పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. పంచాయతీ పెద్దలకు వార్నింగ్ లు ఇస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios