కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నపూర్‌లో సోమవారం నాడు బోటు మునిగిన  ప్రమాదంలో  50 మంది గల్లంతయ్యారు. వీరిలో 15 మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

బెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నపూర్  జిల్లా రూప్నారాయణ్ నదిలో సోమవారం నాడు బోటు మునిగింది. మాయాచర్ , ధన్ పూర్ మధ్య రూప్నారాయణ్ నదిలో సుమారు 50 మంది ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనలో నది నుండి  15 మందిని సురక్షితంగా రక్షించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నది నుండి బయటకు తీసినవారిని శ్యామ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఏపీ రాష్ట్రంలోని గోదావరి నదిలో ఈ నెల 15వ తేదీన బోటు మునిగిన ప్రమాదంలో ఇంకా 15 మంది ఆచూకీ తెలియరాలేదు. ఇవాళ కూడ బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బెంగాల్ రాష్ట్రంలో ఇదే తరహాలో బోటు మునిగింది.