Asianet News TeluguAsianet News Telugu

‘ముందు కొట్టండి.. తర్వాతే ఆలోచించండి’ అనే విధానం సరికాదు.. కేంద్రంపై బీజేపీ ఎంపీ ఫైర్..

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) మరోసారి కేంద్ర  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. తాజాగా దేశంలో నిరుద్యోగ యువత నుంచి ‘అగ్నిపథ్’పై వస్తున్న వ్యతిరేకతపై తనదైన శైలిలో స్పందించారు. 
 

BJP MP Varun Gandhi fires at central Government
Author
Hyderabad, First Published Jun 19, 2022, 3:49 AM IST

దేశంలోని యువ‌త‌కు 10 ల‌క్ష‌ల ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించే దిశ‌గా కేంద్ర ప్రభుత్వం అగ్నిప‌థ్ ప‌థ‌కానికి (Agnipath Scheme) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.  ఈ స్కీమ్ పట్ల నిరుద్యోగులు, యువత నుంచి త్రీవ వ్యతిరేకత వస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు చేసిన ఆందోళనలు దేశాన్నే ఉలిక్కిపడేలా చేశాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ  పథకంపై ఉద్యమకారులు, విద్యావేత్తలు, నిరుద్యోగులు, యూత్ లీడర్లు,  ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, వ్యతిరేకత ఏర్పడింది. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా స్పందించారు. 

ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్న వరుణ్ గాంధీ బీజేపీ విధానాలను తప్పుబట్టారు. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ను ఆయన వ్యతిరేకిస్తూ ఇటీవల సోషల్ మీడియాలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అదేవిధంగా ఈ పథకం రక్షణ శాఖకు అనవసర భారమేనంటూ వరుణ్ గాంధీ ఇటీవల రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ కు కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నిరుద్యోగ యువత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేసిన ఆందోళనపై తాజాగా మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

దేశ భద్రత, యువత విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సరికాదని అభిప్రాయపడ్డారు. ‘ముందు కొట్టండి.. తర్వాతే ఆలోచించండి’ అనే ధోరణిలో కేంద్ర పాలనసాగడం ఏమాత్రం సరైంది కాదని విమర్శించారు. అగ్నిఫథ్ స్కీమ్ ను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే అందులో మార్పులు చేశారంటే.. పథకాన్ని రూపొందించేప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతోందని పేర్కొన్నారు. కేంద్ర ఇంత బాధ్యతాయుతంగా ఉండటం తగదని అని ట్వీటర్ ద్వారా స్పందించారు. ప్రస్తుతం ఈ నేత  చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అటు ప్రతిపక్షాల నుంచి.. ఇటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శులు వెల్లువెత్తుతుండటం, యువత ఆందోళన కార్యక్రమాల బాట పట్టడంతో కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మేరకు ‘అగ్నిపథ్’ రిక్రూట్ కోసం ఐదు కొత్త ప్రకటనలు చేసింది. నిరసన కారులను శాంతిపజేసేందుకు తక్షణమే సానుకూల మార్పులను చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios