కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలో వరద ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు పరిశ్రమలు ముందుకు రావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. దక్షిణ కర్ణాటకలో వరదలు నానా బీభత్సం సృష్టించాయి. 

వరదల ధాటికి లక్షలాది మంది ప్రజలు సర్వం కోల్పోయారు. కొన్నిరోజులు జనజీవనం స్థంభించిపోయింది. తినేందుకు సరైన తిండి దొరక్క ఇప్పటికీ అనేక గ్రామాలు అల్లాడుతున్నాయి. రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.  

ఈ పరిణామాలను చూసి చలించిపోయిన బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్  కర్ణాటక రాష్ట్రప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పలు కంపెనీలను కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు సమర్పించాలని కోరారు. 

సీఎస్ఎఫ్ ఫండ్ లేదా ముఖ్యమంత్రి సహాయనిధికి సహాయం చేసే దాతలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇకపోతే ఇప్పటికే బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. తక్షణమే వరదబాధితుల సహాయార్థం నిధులు ఖర్చుపెట్టాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.