గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. అందుకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులపై, చిన్న పార్టీలపై ఫోకస్ పెట్టాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఇక్కడ తప్పనిసరిగా మారే అవకాశాలు ఉన్నాయి.
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Elections) తీరు విభిన్నంగా ఉంటుంది. ఎన్నిలు జరిగే వరకు ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వ ఏర్పాటు వరకు జరిగే కార్యక్రమాలు మరో ఎత్తుగా ఉంటాయి. ఒక్కోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీ(Single Largest Party)గా అవతరించిన పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు. ఇలాంటి ఉదంతాన్ని గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూశాం కూడా. ఆ చరిత్రను గుర్తు పెట్టుకునే ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు స్వతంత్రుల వేటలో పడ్డాయి. స్వతంత్రులను(Independent MLA) బుజ్జగించి మద్దతు సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే.. గోవాలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీ(Small Parties)లే కింగ్ మేకర్లు.
ఈ సారి గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. ఆప్ కూడా ముమ్మరంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు కాక ఇతర స్థానిక పార్టీలకూ సీట్లు రావడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి, ఈ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయ్యే మెజార్టీ సీట్లు రాకపోవచ్చని బీజేపీ, కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి.
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు గోవాలో ఏ పార్టీ కూడా అంటే బీజేపీ లేదా కాంగ్రెస్ సొంతంగా 21 స్థానాలు గెలుచుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి, హంగ్ వచ్చే అవకాశాలే ఎక్కువ అని ఈ రెండు పార్టీలో అంచనా వేస్తున్నాయి. కాబట్టి, మెజార్టీ మార్క్ మద్దతు సాధించడానికి ఈ రెండు పార్టీలు ఇప్పుడే స్వతంత్ర అభ్యర్థులు, స్థానిక పార్టీలను బుజ్జగించే పనిలో పడ్డాయి.
కాంగ్రెస్ గోవా యూనిట్ చీఫ్ గిరీష్ చోదంకర్ మాట్లాడుతూ, ‘మేం అత్యధిక సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉన్నది. మా అభ్యర్థుల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. గోవా ప్రజలు మార్పును కోరుతూ ఓట్లేశారు. ఒక వేళ మాకు మ్యాజిక్ మార్క్‌కు తక్కువగా సీట్లు వస్తే.. మేం కచ్చితంగా భావ సారూప్యత, లౌకికంగా ఉండే వారి సహకారం తీసుకుంటాం. ముందుగా స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ బరిలోకి దిగారనే విషయాన్ని వారు మరవొద్దు’ అని తెలిపారు. ‘కాబట్టి, ప్రభుత్వ ఏర్పాటుకు మేం అందరి సహకారాన్ని కోరుతున్నాం. ప్రజలందరి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఆటంకం లేకుండా సర్కారును నడిపే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే’ అని వివరించారు.
కాగా, బీజేపీ కూడా ఈ పనిలో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు తక్కువగా అంటే.. 21 స్థానాల కంటే కూడా తక్కువ సీట్లను గెలుచుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం తమ పార్టీకే ఉన్నదని ఆ వర్గాలు తెలిపాయి. ‘2017లో కాంగ్రెస్ 17 సీట్లను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అప్పుడు బీజేపీ కేవలం 13 స్థానాలనే గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీని అడగ్గానే.. అన్ని చిన్న పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి. అలా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో అవాంతరాలు లేకుండా నడిపడం బీజేపీతోనే సాధ్యం అవుతుంది’ అని పేర్కొన్నాయి.
