న్యూఢిల్లీ: మళ్లీ అధికారంలోకి రావాలని కసితో ఉన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన అమిత్ షా ఫలితాలు వెలువడకముందే మిత్ర పక్షాలతో కలిసి హస్తినలో డిన్నర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన తరుణంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఉత్సాహంతో ఎన్డీయే నేతలకు విందు ఇచ్చారని బీజేపీ చెప్పుకొంటున్నప్పటికీ భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకే విందు రాజకీయం ఏర్పాటు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. 

వీవీ ప్యాట్ ల పేరుతో విపక్షాలు నానా హంగామా చేస్తుండటంతోపాటు ఒక్కొక్కరుగా యూపీఏ కూటమికి హ్యాండ్ ఇస్తున్న తరుణంలో బీజేపీ చీఫ్ కూడా అప్రమత్తమయ్యారు. తమ మిత్రపక్షాలను కాపాడుకోవడంతోపాటు ఇతరపక్షాలకు గేలం వేసే అంశాలపై వారి విందులో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఇచ్చిన ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం పళని స్వామి, ఎల్జీపీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ లతోపాటు బీజేపీ, ఎన్డీయే పక్షాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. 

 

అంతకుముందు, ఎన్డీయే నేతలు, కేంద్ర మంత్రులతో పార్టీ ప్రధాన కార్యాలయంలో మోదీ, అమిత్‌షా భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తులో అనుసరించాల్సి వ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.