బెంగళూరులోని ఓ హౌజింగ్ సొసైటీ బ్యాచిలర్ రూమ్‌లకు పెట్టిన కండీషన్లు చర్చనీయాంశం అయ్యాయి. రాత్రి పూట గెస్టులు రావొద్దని, ఎవరైనా గెస్టులు రాత్రి ఉండాల్సి ఉంటే ముందస్తుగానే వారి వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని, నైట్ పార్టీలు చేసుకోరాదనే కండీషన్లు పెట్టారు. అందుకు సంబంధించిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బెంగళూరు: రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూల్స్ పెట్టడం సర్వసాధారణమే. కానీ, బెంగళూరులోని ఓ హౌజింగ్ సొసైటీ పెట్టిన రూల్స్ మరీ తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్లకు పెట్టిన రూల్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
బెంగళూరులోని కందన్హల్లి గేట్ ఏరియాలోని ఆ సొసైటీ బ్యాచిలర్లకు పెట్టిన కండీషన్ల పేపర్‌ను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టు వైరల్ అయింది. బ్యాచిలర్ కుర్రాళ్లు, అవివాహిత మహిళల గదికి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత గెస్టులు రావొద్దని కండీషన్ పెట్టింది. రాత్రిపూట బయటి వారు వారి ఫ్లాట్‌లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒక వేళ ఉండాల్సిన పరిస్థితి ఉంటే.. గెస్టు ఐడీ వివరాలు, కారణాలను ఓనర్‌కు, మేనేజర్‌కు ముందుగానే మెయిల్ చేసి అనుమతి తీసుకోవాలి అనే కండీషన్లు పెట్టారు. అంతేకాదు, ఎప్పటి వరకు ఫ్లాట్‌లో ఉంటారనే వివరాలు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు.
అంతేకాదు, బ్యాచిలర్లు, పెళ్లి కాని మహిళలు ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే మినహాయింపులేవీ ఉండవని పేర్కొన్నారు. రూ. 1000 జరిమానా లేదా.. అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి ఉండటం వంటివి శిక్షగా ఉన్నాయని ఆ రూల్స్ పేపర్లో వివరించారు.
Also Read: విచిత్ర పెళ్లి: లవ్ మ్యారేజీ చేసుకుని భర్తపైనే రేప్ కేసు.. వారిద్దరి కుటుంబాలు ఏం చేశాయంటే?
అలాగే.. మరికొన్ని సాధారణ నిబంధనలు కూడా ఉన్నాయి. రాత్రి 10 తర్వాత లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవద్దు.. పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీలూ చేసుకోవద్దని కండీషన్లు ఉన్నాయి. కారిడార్లు, బాల్కనీల్లో రాత్రి 10 గంటల తర్వాత ఫోన్లు మాట్లాడొద్దని పేర్కొన్నారు. అంతేకాదు, బ్యాచిలర్ల రూమ్లపై నిఘా వేస్తామనే విషయాన్నీ పేర్కొనడం గమనార్హం. గెస్టులు వెళ్లిపోయారా? లేదా? అని కూడా గార్డులు వచ్చి చెక్ చేస్తారని తెలిపారు.
ఈ కండీషన్లు చదివిన నెటిజన్లు విమర్శలు చేశారు. ఇవి హాస్టల్స్ కంటే కూడా వరస్ట్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక ఫ్లాట్ మొత్తంగా ఉపయోగించుకోవడానికి రెంట్ ఇస్తామని, రెంటల్ అగ్రీమెంట్ ఉన్నంత వరకు ఆ ఫ్లాట్ మొత్తం అద్దె కట్టిన వ్యక్తిదే అని తెలిపారు. ఆ ఫ్లాట్‌కు ఎవరు వస్తున్నారు? ఎలా ఉంటున్నారు? బాల్కనీలో ఏం చేస్తున్నావ్ వంటి విషయాలన్నీ ఓనర్లకు, మేనేజర్లకు అనవసరం అని తెలిపారు.