బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ఆర్జేడీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ..... సమయం గడుస్తున్నా కొద్దీ బీజేపీ దూసుకొచ్చింది. మహా ఘట్ బంధన్ కి సమానంగా సీట్లను సాధించేలా కనబడుతుంది. ప్రస్తుతానికి ఇవి కేవలం తొలి రౌండ్ల ఫలితాలే అయినప్పటికీ.... ట్రెండ్స్ మాత్రం ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి. 

ఇక 243 సీట్లలో బీజేపీ గనుక 100 నుంచి 110 సీట్లను సాధించగలిగితే ఎండీ కూడా మహా ఘట్  బంధన్ తో సహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్, కుష్వాహా, మాంఝి,వీఐపీ ముకేశ్ సహానీ వంటివారు కీలకంగా మారనున్నారు. 

హంగ్ పరిస్థితులు వస్తే ఇలాంటి చిన్న చిన్న పార్టీలు కీలకంగా మారనున్నాయి. అప్పుడు పోస్ట్ పోల్ పరిస్థితుల్లో ఇటు బీజేపీకి, అటు ఆర్జేడీకి అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం దక్కనుంది. 

ఈ బీహార్ ఉపఎన్నిక చూడబోతుంటే ఐపీఎల్ ని తలపిస్తుంది. ఒకవేళ గనుక ఐపీఎల్ పరిభాషలో మాట్లాడితే.... ఐపీఎల్ స్కోర్స్ టై అయితే సూపర్ ఓవర్ లో ఫలితం తేలినట్టు, ఈ బీహార్ ప్రీమియర్ లీగ్ లో కూడా పోస్ట్ పోల్ అలయన్స్ ల ఆధారంగానే తేలేలా కనబడుతుంది. 

నేటి ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమయింది. కౌంటింగ్ కి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల కమిషన్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత కోసం భారీ స్థాయిలో బలగాలను మోహరించింది. 

ఓట్ల లెక్కింపు కోసం బీహార్ వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసారు.  తూర్పు చంపారన్‌, గయ, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో మూడేసి చొప్పున కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతను  ఏర్పాట్లు చేశారు.

మొత్తం 55 కౌంటింగ్ కేంద్రాల్లో 1,06,524 ఈవీఎంలను లెక్కించనున్నారు. 370 మంది మహిళా అభ్యర్థులతో సహా 3,588 మంది మంది అభ్యర్థుల భవితవ్యాలు ఇప్పటికే వాటిలో నిక్షిప్తమయ్యాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకూ  పూర్తిగా వీడియో రికార్డింగ్ ను చేయనున్నారు.