భారీ వర్షాలు వరదల కారణంగా బీహార్‌ వణికిపోతోంది. రాజధాని పాట్నా సహా మొత్తం 38 జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలిపిస్తుండగా.. నిత్యావసరాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో గత 48 గంటలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. రోడ్లపై నడుం లోతు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు, వైద్యసేవలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి.

పాట్నా, దానాపూర్ తదితర రైల్వేస్టేషన్లు వరదల్లో చిక్కుకుపోవడంతో రైల్వేశాఖ 30 రైళ్లను రద్దు చేసింది. కొన్ని విమాన సర్వీసులను కూడా దారి మళ్లించారు. వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కుటుంబసభ్యులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా.. వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, గుజరాత్‌లో ముగ్గురు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లలో కలిపి 13 మంది వరకు మరణించారు.