కోవిడ్‌ను నివారించేందుకు గాను భారతదేశం దేశీయంగా రెండు టీకాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. సీరమ్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌లకు భారత్ అత్యవసర వినియోగానికి అనుమతించింది.

దీనిలో భాగంగా జనవరి 16 నుంచి కోవిషీల్డ్‌ను ప్రజలకు ఇచ్చేందుకు గాను మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌కు ఇండియా తెరదీసింది. అయితే మన వ్యాక్సిన్‌లకు పలు దేశాల నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయి.

తాజాగా బ్రెజిల్‌ వ్యాక్సిన్‌ కోసం భారతీయ ఫార్మా సంస్థలను సంప్రదిస్తోంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకునేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. కొవాగ్జిన్‌ టీకాను సరఫరా చేసేందుకు అక్కడి మెడికల్‌ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.  

వ్యాక్సిన్‌ వివరాలు, సరఫరా సాధ్యాసాధ్యాలపై ఈ నెల 7, 8 తేదీల్లో ప్రెసిసా ప్రతినిధులు హైదరాబాద్‌లోని కేంద్రాన్ని సందర్శించినట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇప్పటికే కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పూర్తి సురక్షితమని తేలడంతో పాటు రోగనిరోధకతలోనూ మంచి పనితీరు కల్పిస్తుందనే విషయం రుజువయ్యిందని పేర్కొన్నారు. 

ఇక, వ్యాక్సిన్‌ పనితీరులో భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టీకా తమ అంచనాలను మించి ఉందని బ్రెజిల్‌ ఫార్మా సంస్థ డెరెక్టర్‌ ఎమాన్యూయేల్‌ మెడ్రాడెస్‌ స్పష్టంచేశారు. కాగా, బ్రెజిల్‌లో ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రయత్నిస్తున్నాయి.