కన్నడ భాషే వాడాలి.. ఇంగ్లీష్ బోర్డులను పీకిపారేస్తోన్న ఆందోళనకారులు, బెంగళూరులో ఉద్రిక్తత
రాష్ట్రంలోని వాణిజ్య, వ్యాపార సంస్థల నేమ్ బోర్డులపై 60 శాతం కన్నడ అక్షరాలే వుండాలన్న నిబంధనను అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసింది.
రాష్ట్రంలోని వాణిజ్య, వ్యాపార సంస్థల నేమ్ బోర్డులపై 60 శాతం కన్నడ అక్షరాలే వుండాలన్న నిబంధనను అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్ధతుగా కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. దీనిలో భాగంగా రాజధాని బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారి తీశాయి. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, తదితర ప్రాంతాల్లో రెచ్చిపోయిన నిరసనకారులు హోటళ్లు , దుకాణాలపై ఆంగ్లంలో వున్న నేమ్ బోర్డులను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరు నగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు తక్షణమే నేమ్ బోర్డులపై కన్నడ అక్షరాలు చేర్చాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో వున్న హోటళ్లు, దుకాణాలు, కార్యాలయాల బయట వున్న బోర్డులను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లపై నల్లరంగు సిరా పోశారు. సమాచారం అందుకున్న పోలీసులు .. వారిని కస్టడీలోకి తీసుకుని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనలపై బీబీఎంసీ కమీషనర్ తుషార్ గిరినాథ్ స్పందించారు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తాయని , వాటిని పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కాగా.. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వాణిజ్య సంస్థలు తమ పేర్లను కన్నడలోనే ఏర్పాటు చేసేలా కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సిద్ధరామయ్య సర్కార్ .. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాల నేమ్ బోర్డుల్లో 60 శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది. ఫిబ్రవరి చివరి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. అయితే గడువుకు ముందే ఆందోళనకారులు రెచ్చిపోతూ వుండటంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.