అసభ్యకర పోస్టులతో తన భార్యు వేధిస్తున్న ఓ యువకుడిని పోలీస్ స్టేషన్‌లోనే చితకబాదాడు ఓ ఐఏఎస్ అధికారి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌ అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నిఖిల్ నిర్మల్‌ అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ తన భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నారు.

ఈ క్రమంలో అతని భార్యకు ఓ వ్యక్తి నుంచి అసభ్యకర మేసేజ్ వచ్చింది. తొలుత దీనిని పట్టించుకోనప్పటికీ ఆ తర్వాత అవి మరింత ఎక్కువ కావడంతో నిఖిల్  దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ కుమార్ సర్కార్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిఖిల్ ఆదివారం తన భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. యువకుడిని చూడగానే కోపంతో ఊగిపోయారు..  ఆవేశంతో అతనిని చితకబాదారు..

యువకుడు క్షమించమన్నా వదల్లేదు.. ఐఏఎస్ భార్య కూడా యువకుడిని కొట్టింది. ఈ తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. దీనిపై ప్రజాస్వామ్య సంఘాలు మండిపడుతున్నాయి. ఐఏఎస్ అధికారి అయినంత మాత్రాన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి యువకున్ని కొట్టే అధికారం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.