కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా.. అరుణ్ జైట్లీకి కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకోవాలని ఆరాటపడ్డారు. కొందరు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ... మరికొందరు మాత్రం తమ చేతివాటం చూపించారు..

జైట్లీ అంత్యక్రియల సమయంలో ఐదుగురు తమ ఫోన్లు పోగొట్టుకోవడం గమనార్హం. కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, సోమ్ ప్రకాష్, సుప్రియో సెక్రటరీ, మరో ఇద్దరి ఫోన్లు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని... ఫోన్లను ట్రేస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై బాబుల్ సుప్రియో మాట్లాడుతూ.. నిగమ్ బోధ్ ఘాట్ లో ఓ చోట జనాలు గుమ్మిగూడి ఉన్నారని... ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని అప్పుడే ఫోన్ చోరీకి గురైందని చెప్పారు. అంత్యక్రియల దగ్గర ఎక్కువ సీసీ కెమేరాలు పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం తమవే కాదని.. సాధారణ ప్రజలు కూడా తమ వస్తువులు కోల్పోయి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.