సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్దే నియమితులయ్యారు.  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేశారు. 
ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17న ముగియనుంది. చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎస్ఏ బాబ్డే  నవంబర్ 18న   ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

 ఎస్ఏ బాబ్డే మహారాష్ట్రలోని నాగపూర్ లో 1956 ఏప్రిల్ 24న  జన్మించారు. నాగపూర్ యూనివర్శిటీలో ఆయన విద్యనభ్యసించారు.  2013 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా  నియమితులయ్యారు. అంతకుముందు  బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2000వ సంవత్సరంలో బాధ్యతలు నిర్వహించారు. 

ఆ తర్వాత 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలను చేపట్టారు.  ప్రస్తుత చీఫ్ జస్టిస్  పదివికాలం  త్వరలో ముగుస్తుండడంతో ఆ పదవీని శరద్ అర్వింద్ నిర్వహించనున్నారు.  18 నెలల పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిగా ఎస్ఏ బాబ్డే వ్యవహరించనున్నారు.

పదవీ విరమణకు నెల రోజుల ముందు తదుపరి చీఫ్ జస్టిస్ పేరును  ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ప్రతిపాందించడం  ఆనవాయితీ. కావున నూతన సీజేఐగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ లేఖ రాశారు. 

ఆయన ప్రతిపాదనను సమీక్షించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆ లేఖను ప్రధానమంత్రికి, అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు పంపింది. అనంతరం జస్టిస్ బాబ్డేను తదుపరి చీఫ్ జస్టిస్ గా నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.