లక్నో : అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అనే విషయమై  బుధవారం నాడు సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలను విన్నది. ఈ విషయమై తీర్పును  సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

సుప్రీంకోర్టు జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం నాడు కేసును విచారించింది. 

ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు, మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశమని  ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే గతాన్ని ఎవరూ కూడ మార్చలేరని కోర్టు అభిప్రాయపడింది.  

బాబ్రీ మసీదును ఎవరు కూల్చారు, ఇక్కడ ఏముందనే విషయాలు ఇప్పుడు అప్రస్తుతమన్నారు.ప్రస్తుత వివాదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొంటామని ధర్మాసనం చెప్పింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చూస్తామని కోర్టు చెప్పింది.  సమస్య పరిష్కారం కోసం  ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమని  కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయమై మధ్యవర్తులను ఏర్పాటు చేయడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా  వ్యతిరేకించాయి. మధ్య వర్తిత్వాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ప్రతిపాదించడాన్ని ముస్లిం సంఘాలు స్వాగతించాయి.  ఈ సమస్యకు పరిష్కారం ఇరువర్గాలను కలిపి ఉంచేలా ఉండాలని ముస్లిం పిటిషనర్ల తరపు అడ్వకేట్  రాజీవ్ ధావన్ కోర్టును కోరారు. మధ్యవర్తి ఏర్పాటు ప్రతిపాదనను యూపీ ప్రభుత్వం వ్యతిరేకించింది.

అయితే ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే గనుక ఇరు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ స్పష్టం చేశారు.  

2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, ధార్మికసంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.