న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో ఇప్పటి వరకు 515 మంది  వైద్యులు మరణించారని ఐఎంఏ ప్రకటించింది. కరోనాతో మరణించినవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ అభిప్రాయపడ్డారు.

కరోనాతో దేశంలో 515 మంది వైద్యులు అమరులైనట్టుగా ఆయన ప్రకటించారు. మృతి చెందినవారంతా అల్లోపతి డాక్టర్లని ఐఎంఏ తెలిపింది. దేశంలోని 1746 ఐఎంఏ బ్రాంచీల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించినట్టుగా ఆయన తెలిపారు.వాస్తవానికి కరోనా రోగులకు సేవ చేస్తూ మరణించిన వైద్యల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు న్న 18 మంది డాక్టర్లు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 60 నుండి 70 ఏళ్ల వయస్సున్న 201 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 నుండి 60 ఏళ్ల వయస్సున్న 171 మంది చనిపోయారు.  70 ఏళ్ల పైబడిన 66 మంది డాక్టర్లు, 35 నుండి 50 ఏళ్ల లోపున్న 59 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్టుగా ఐఎంఏ తెలిపింది.

కరోనా విధులు నిర్వహిస్తూ చనిపోయిన వైద్యులు ఎంతమందనే విషయమై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదని ఆయన చెప్పారు.

ప్రజారోగ్యం, ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. దీంతో కరోనా రోగులకు వైద్యం చేస్తూ మరణించిన రోగుల సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆశ్విన్ కుమార్ చౌబే పార్లమెంట్ కు చెప్పిన విషయాన్ని ఐఎంఏ గుర్తు చేసింది.