పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Election 2022) పోలింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) మూడో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగుతుంది. 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Election 2022) పోలింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. ఈ ఎన్నికల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. అయితే పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. అయితే పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరంగా మారాయి.

మరో గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో.. ప్రస్తుతం సీఎం చరణ్​జిత్​సింగ్​ చన్నీ, ఆప్​ సీఎం అభ్యర్థి​ భగవంత్​ మాన్​, పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ సిద్దు, మాజీ సీఎంలు అమరీందర్ సింగ్​​, ప్రకాశ్​ సింగ్​ బాదల్​, రాజిందర్ కౌర్ భట్టల్, శిరోమణి అకాలీదళ్​ అధ్యక్షుడు​ సుఖ్​బీర్​సింగ్​ బాదల్, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సంప్లా వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. 

వీరిలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చౌమ్‌కౌర్ సాహిబ్, Bhadaur స్థానాల నుంచి బరిలో ఉన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్‌సర్ ఈస్ట్, అమరీందర్ సింగ్.. పటియాలా, సుఖ్‌బీర్ సింగ్ బాద్.. జలాలాబాద్, Bhagwant Mann.. ధురి, ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబి స్థానాల నుంచి ఎన్నిక బరిలో నిలిచారు. 

ఇక, పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్​ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 77 సీట్లలో, ఆప్​ 20 చోట్ల గెలిచింది. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 

ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ.. 
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (UP Election 2022) మూడో దశ పోలింగ్ నేడు జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగుతుంది. మొత్తం 2.15 కోట్ల మంది ఓటర్లు.. ఎన్నికల బరిలో నిలిచిన 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల జరిగే జిల్లాలు జాబితాలో.. హత్రాస్, ఫిరోజాబాద్, ఎటా, కస్గంజ్, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా ఉన్నాయి. ఇక, నేడు మూడోదశ పోలింగ్ పూర్తయితే యూపీ అసెంబ్లీ‌లో మొత్తం 403 స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు పోలింగ్ పూర్తయినట్టే. 

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్‌పురిలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి ఈ దశలోనే పోలింగ్ జరగుతుంది. ఇక, అఖిలేష్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయ‌నకు పోటీగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ బరి‌లోకి దిగారు. అఖి‌లేశ్‌ యాదవ్ బాబాయి శివ‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న జశ్వం‌త్‌‌న‌గ‌ర్‌కు నేడు పోలింగ్ జరుగుతుంది. 

ఇక, 2017 జరిగిన ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో.. బీజేపీ 49 స్థానాల్లో, సమాజ్‌వాద్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.