ఎన్నో ఆశలతో సినీ రంగంలో అడుగుపెట్టింది. గొప్ప తారగా ఎదగాలని కలలు కన్నది. కానీ ఆమె ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. ఆమె కోరికలు తీరకుండానే... తార గా గుర్తింపు పొందకుండానే అర్థాంతరంగా తన జీవితాన్ని ముంగించేసింది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ముంబయి నగరంలో ఓ వర్థమాన సినీ నటి ఆత్మహత్య చేసుకుంది. కాగా... ఆమె ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భవనం పై నుంచి పెద్దశబ్ధం రావటంతో.. పూలకుండీ కింద పడిపోయిందని భావించారు. తీరా చూస్తే.. రక్తపు మడుగులో ఒక యువతి ఉండటాన్ని గుర్తించి.. పరుగు పరుగున ఘటనాస్థలానికి వెళ్లారు.

ఆ వర్థమాన నటి ఎవరో కాదు..  పెర్ల్ పంజాబీ. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిపోవాలని.. తల్లిదండ్రుల్ని ఎదిరించి.. వారి ఇష్టానికి వ్యతిరేకంగా సినీ అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించి విసిగిపోయి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు.

పాతికేళ్ల పెర్ల్ పంజాబీ.. తన టాలెంట్ ఫ్రూవ్ చేసుకోవాలని తెగ ప్రయత్నం చేసింది. అవకాశాల కోసం ఫిలిం ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఆఫర్లు రాలేదు. హీరోయిన్ గా వెలిగిపోవాలన్న ఆమె ఆశకు భిన్నంగా చిన్న చితకా పాత్రలు తప్పించి.. పెద్ద అవకాశం ఏదీ రాలేదు. దీంతో.. విసిగిపోయిన ఆమె ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. 

తీవ్రమైన మానసిక ఒత్తిడి.. తల్లితో ఆమెకున్న విభేదాల నేపథ్యంలో బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సినిమాల్లో నటించడానికి సరైన అవకాశం రాకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.