పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లీస్ సత్తా చాటింది. తెలంగాణలోని హైదరాబాదుకే పరిమితమైందనే ఎంఐఎం క్రమంగా దేశవ్యాప్తంగా తన వేళ్లను పాతుకుంటూ పోతోంది. 

బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ కలిసి గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎస్ఎఫ్)గా ఏర్పడ్డాయి. ఈ కూటమి మహా ఘట్ బంధన్ విజయావకాశాలను దెబ్బ తీసిందని అంచనా వేస్తున్నారు. ముస్లీం ఓటు బ్యాంకును చీల్చడంతో మహా కూటమి విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. 

బీహార్ లో గతంలో మజ్లీస్ ఒక్క సీటు కూడా గెలుపొందిన దాఖలాలు లేవు. ఈసారి మజ్లీస్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆర్డేడీకి మద్దతుగా నిలుస్తూ వస్తున్న యాదవులతో పాటు ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చినట్లు భావిస్తున్నారు. 

మజ్లీస్ ఐదు సీట్లను గెలుచుకోవడంతో పాటు పలు స్థానాల్లో ఆర్డెడీ సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి కొట్టినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్జెడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహా కూటమి ఓటమికి ఇది కూడా ఓ కారణమని భావించవచ్చు.

తొలుత ముందంజలోకి వచ్చిన మహాకూటమి లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ వెనకబడుతూ వచ్చింది. కాంగ్రెసు తనకు కేటాయించిన సీట్లలో సరైన ఫలితాలు సాధించలేకపోయింది. కేవలం 43 స్థానాలను మాత్రమే సాధించగలిగింది.

2015 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఐదు స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలిపారు. అయితే, ఒక్క స్థానం కూడా గెలువలేదు. 2019లో కిషన్ గంజ్ నియోజకవర్గం ఎమ్మెల్యే లోకసభ పోటీ చేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మజ్లీస్ విజయం సాధించి బీహార్ లో బోణీ కొట్టింది. 

ఈసారి ఎన్నికల్లో గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ లో చేరి 20 స్థానాల్లో అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థులను పోటీకి దింపారు. వారిలో ఐదుగురు విజయం సాధించారు. అమోర్ స్థానం నుంచి మజ్లీస్ బీహార్ అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ విజయం సాధించారు. అయితే, 2019 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్ గంజ్ లో మాత్రం మజ్లీస్ ఓటమి పాలైంది. 

బీహార్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు తాము బీహార్ లో సాదించిన విజయం చాలా గొప్పదని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.