ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రేసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాల్లో కేజ్రీవాల్‌కు చుక్కెదురైనట్టుగా తెలుస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రేసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాల్లో కేజ్రీవాల్‌కు చుక్కెదురైనట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ తలపెట్టిన విందు భేటీ విఫలమైనట్టుగా తెలుస్తోంది.. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి థర్డ్ ఫ్రంట్ కూటమి ప్రయత్నాల్లో భాగంగా బీజేపీయేతర, కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరవింద్ కేజ్రీవాల్ మార్చి 18న విందుకు ఆహ్వానించారు. అయితే అందులో ఒక్కరు కూడా విందు సమావేశానికి హాజరుకాలేదని సంబంధిత వర్గాలు సోమవారం చెప్పినట్టుగా పీటీఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కూటమిలో కీలక భూమిక పోషించాలనే ఆప్ ఆశయానికి ఈ పరిణామం భారీ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కేజ్రీవాల్ లేఖలు పంపినవారిలో పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. తనతో కలుపుకుని ‘‘ప్రగతిశీల ముఖ్యమంత్రుల బృందం ఆఫ్ ఇండియా (G-8)’’ పేరుతో ఈ విందు భేటీ నిర్వహించాలని కేజ్రీవాల్ చూశారు. దేశ రాజధాని ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో మార్చి 18న ఈ విందు జరగాల్సి ఉంది. ఆ మరుసటి రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కేజ్రీవాల్ భావించినట్టుగా తెలుస్తోంది.
‘‘2023 మార్చి 18 సాయంత్రం ఢిల్లీలో విందు సమావేశానికి గుమిగూడదాం. ఇది మన మొదటి సమావేశం. మన సమూహం ముందుకు వెళ్లే మార్గాన్ని చర్చించడానికి ఇది మనకు అవకాశం ఇస్తుంది’’ అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ‘‘మన రాష్ట్రాలు, మన దేశానికి కొత్త ప్రారంభాన్ని గుర్తించడానికి కలిసి రండి’’ అని కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 5న ఈ లేఖ పంపినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అయితే గతకొంతకాలంగా బీజేపీయేతర, కాంగ్రేసేతర కూటమికి సంబంధించి పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఈ దిశలో ప్రయత్నాలు జరిపారు. అయితే అందులో పెద్దగా ఫలితం లభించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో కలిసి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. మరోవైపు ఒకవేళ కూటమి ఏర్పడితే.. దానికి తానే నేతృత్వం వహించాలనే ఉద్దేశంతో మమతా బెనర్జీ ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది.
ఇదిలా ఉంటే.. బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది. ఇటీవల డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్ ఆలోచనలను తిరస్కరించడంతో పాటుగా కాంగ్రెస్ లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం అర్దరహితం అని అన్నారు. మరోవైపు బిహార్‌లోని జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ క్రమంలోనే మనీష్ సిసోడియాపై సీబీఐ చర్యను నిరసిస్తూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖపై జేడీయూ సంతకం చేయలేదని తెలుస్తోంది. బీహార్‌లో దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ అనుసరించిన లైన్‌ను జేడీయూ అనుసరించినట్లు కనిపించింది.