ట్రాన్స్‌జెండర్‌వి నీకు రాజకీయాలు అవరసరమా.. నువ్వేం చేస్తావు అన్న వారి నోళ్లు మూయించేలా 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కీలకపదవిని సంపాదించింది ఓ ట్రాన్స్‌జెండర్. తమిళనాడుకు చెందిన అప్సరారెడ్డిని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.

134 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పార్టీ జాతీయ స్థాయిలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఇదే తొలిసారి. గతంలో జర్నలిస్టుగా బీబీసీ, ది హిందూ వంటి పలు వార్తా సంస్థల్లో ఆమె పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఏఐడీఎంకేలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత మరణం తర్వాత పార్టీ రెండుగా చీలడంతో ఆమె శశికళ వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె రాహుల్ దృష్టిలో పడ్డారు.

ఈ క్రమంలో ఆమెను మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.

అనంతరం అప్సరా రెడ్డి మాట్లాడుతూ..‘‘తనను ట్రాన్స్‌జెండర్‌గా ఎగతాళీ చేశారని.. అద్బుతాలు జరగవని, నిన్ను చూసి నవ్వుతారని...ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అనే మాటలు తన జీవితంలో ఎన్నో విన్నట్లు తెలిపారు.

అయిన్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లానన్నారు. తనకు ఇంతటి గొప్ప అవకాశం కలిగించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు.. మహిళలు, పిల్లలు ట్రాన్స్‌జెండర్ల తరపున నా గొంతు బలంగా వినిపిస్తాను.. భారతదేశంలోని అతిపెద్ద, సుధీర్ఘ చరిత్ర గల పార్టీలో తనకు ఈ పదవి దక్కడం... ఉద్వేగానికి గురిచేస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు.