బళ్లారి: బళ్లారి మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెప్పి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యాడు. అక్టోబర్ మొదటివారంలో బెంగళూరులో పార్టీ ముఖ్యనేతల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు అనిల్ లాడ్ ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీకి బళ్లారి ప్రాంతంలో ఎంతోకాలంగా అన్నీ తానై వ్యవహరించాడు అనిల్ లాడ్. బళ్లారి నుంచి మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపైన పోటీ చేసి ఒక్కసారి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇతన్ని రాజ్యసభకు కూడా ఒకసారి నామినేట్ చేసింది. 

పార్టీ వీడడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలే కారణమని అనిల్ తెలిపారు. ఈ గ్రూపు రాజకీయాలవల్ల నాయకుల మధ్య సమన్వయము లోపించిందని, అంతర్గత విభేదాలు అధికమయ్యాయని వీటి వల్లనే పార్టీ వీడుతున్నట్టు అనిల్ లాడ్ తెలిపాడు. 

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంవల్ల ఈ  కూటమి అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాంటి కీలక నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.