మేఘాలయాలో మరో గని ప్రమాదం చోటు చేసుకుంది.. ఈస్ట్ జయంతియా జిల్లాలోని జలయా గ్రామం సమీపంలోని బొగ్గు గనిలో పనిచేసే ఎలద్ బర్ అనే వ్యక్తి కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గాలింపు చర్యల్లో భాగంగా అతని మృతదేహాన్ని ఓ అక్రమ బొగ్గు గని వద్ద కనుగొన్నారు. ఇది హత్యా, లేక ప్రమాదవశాత్తూ జరిగినదా అన్న కోణంలో పోలీసులు పరిసరాల్లో ఆధారాలతో కోసం వెతుకుతుండగా... మరో మృతదేహం కనిపించింది.

ఇద్దరు కార్మికులు బొగ్గును సేకరిస్తుండగా గని కూలి చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గని యజమాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్రమ మైనింగ్‌పై నిషేధం కొనసాగుతున్న ఈ ప్రాంతంలో బొగ్గును సేకరిస్తున్నారు జిల్లా ఎస్పీ తెలిపారు.

కాగా, గత నెల 11న ఇదే జిల్లాలోని ఓ అక్రమ బొగ్గు గనిని సమీపంలోని నది ముంచెత్తడంతో అక్కడ పనిచేస్తోన్న పదిహేను మంది కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. ఇంతవరకు వారి జాడ కనిపించలేదు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన తదితర సంస్థలు నేటికి వారికోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి.