అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి తీవ్ర అస్వస్థత..
తమిళనాడు (Tamilnadu)లోని ఎన్నూర్ (Ennore)లో జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ ఎరువుల కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది (ammonia gas leak). అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన వల్ల 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు (12 people seriously ill). స్థానికులు తీవ్ర దుర్వాసన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ammonia gas leak : అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఎన్నూర్ లో జరిగింది. ప్రస్తుతం బాధితులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ఎన్నూర్ జిల్లాలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ ఉంది. ఇందులో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు ఉపయోగిస్తారు. ఎరువులు తయారు చేయడానికి ముడిసరుకుగా అమ్మోనియాను ఉపయోగిస్తారు. అయితే ఆ గ్యాస్ ఇప్పుడు లీకై ఈ పరిస్థితికి దారి తీసింది. ఆ కంపెనీ సిబ్బంది మంగళవారం రాత్రి పైప్ లైన్ ప్రీ కూలింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో అందులో నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ విషయంలో అర్ధరాత్రి 12.45 గంటలకు కంపెనీ నుంచి అధికారులకు సమాచారం వచ్చింది.
గ్యాస్ లీకేజీతో స్థానికులు (పెరియకుప్పం, చిన్నకుప్పం వంటి గ్రామాలకు చెందినవారు) తీవ్ర దుర్వాసన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం అంబులెన్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
అస్వస్థతకు గురైన 12 మందిని స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు. మరికొందరిని అర్ధరాత్రి సమయంలోనే కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీని కంపెనీ రాత్రే అదుపులోకి తెచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని చెప్పారు. కాగా.. ఈ ఘటన అనంతరం తమిళనాడు పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ టీం తనిఖీలు చేపట్టింది. మెటీరియల్ గేటు సమీపంలో తెల్లవారుజామున 3.30 గంటలకు పరిసర గాలిలో అమ్మోనియా స్థాయిని పర్యవేక్షించింది.