అమరావతి:కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇళ్లుమారారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయీ నివాసానికి మారారు. సెంట్రల్ ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్ లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయీ నివాసం ఉన్న బంగ్లాకి మంగళవారం అమిత్ షా షిఫ్ట్ అయ్యారు. 

ఇప్పటి వరకు అమిత్ షా అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు. అయితే ఆ బంగ్లాను ఇటీవలే ఖాళీ చేశారు. రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం, మోదీ కేబినెట్ లో అమిత్ షా కీలకమైన హోం శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన వాజ్ పేయీ నివాసం ఉన్న బంగ్లాకు మారారు. 

మాజీ ప్రధాని అఅటల్ బిహారి వాజ్ పేయీ గత ఏడాది మరణించారు. అప్పటి నుంచి ఆ బంగ్లా ఖాళీగానే ఉంటుంది. దాంతో ఆ బంగ్లాలోకి అమిత్ షా షిఫ్ట్ అయ్యారు. ఇకపోతే ఇటీవలే మాజీ ఎంపీలు ప్రస్తుతం ఉంటున్న బంగ్లాలను ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది.

మాజీ ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయకపోతే విద్యుత్, వాటర్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే చాలా మంది ఎంపీలు తమ బంగ్లాలను ఖాళీ చేశారు. ఆ మాజీ ఎంపీలు ఖాళీ చేసిన బంగ్లాల్లోకి నూతనంగా ఎంపికైన ఎంపీలు సిఫ్ట్ అవుతున్నారు.