ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లో కేంద్ర మంత్రి అమిత్ షా అధికారిక ఖాతా నుంచి ఆయన ఫోటో తొలగించారు. కొద్ది సేపు ఆయన ప్రొఫైల్ ఫోటో మాయమైంది.

ఓ కాపీరైట్ హోల్డర్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే  ఆ ఫోటోను తొలగించినట్టు ట్విటర్ పేర్కొంది. ఆయనకు చెందిన వెరిఫైడ్ ఖాతాలో డిస్‌ప్లై పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఓ తెల్ల పేజీలో చిన్న సందేశం కనిపించడం గమనార్హం. ‘‘మీడియా కనిపించదు. ఓ కాపీరైట్ హక్కుదారుడి నుంచి అందిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా ఈ ఇమేజ్‌ను తొలగించడం జరిగింది..’’ అంటూ ఓ సందేశం కనిపించింది. 

అయితే కొద్ది సేపటికే మళ్లీ అమిత్ షా ప్రొఫైల్‌ ఫోటోను పునరుద్ధరించారు. దీనిపై ట్విటర్ నుంచి ఇంకా ఇతర వివరాలేవీ వెల్లడికాలేదు. ‘‘సాధారణంగా, ఎలాంటి ఫోటో అయినా సరే.. ఆ ఫోటోలో ఏముందన్నది కాదు.. సదరు ఫోటోను తీసిన ఫోటోగ్రాఫరే దాని అసలు హక్కుదారుడు...’’ అని ట్విటర్ కాపీరైట్ పాలసీ చెబుతోంది. 

కాగా ఇటీవల ఇదే తరహా కాపీరైట్ వివాదంతో బీసీసీఐ అధికారిక ఖాతా నుంచి డిస్‌ప్లై ఫిక్చర్‌ను ట్విటర్ యాజమాన్యం తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటన అమిత్ షా విషయంలోనూ రిపీట్ అయ్యింది.