న్యూఢిల్లీ: అంబులెన్స్ డ్రైవర్ కరోనాతో మరణించాడు. గత ఆరు మాసాలుగా కరోనా రోగులను తన అంబులెన్స్ లో తరలించడమే ఆయన పనిగా పెట్టుకొన్నాడు. ఆరు మాసాలుగా ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నాడు.  ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది.

ఆరీఫ్ ఖాన్ ఢిల్లీలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 48 ఏళ్ల ఆరీఫ్ ఖాన్ అంబులెన్స్ లో కరోనా రోగులను ఆసుపత్రికి తరలించడం, మరణించిన వారిని అంత్యక్రియల కోసం తరలించే పనిలో ఉన్నాడు.కరోనా సోకిన ఆయన హిందూరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు ఉదయం మరణించాడు.

షహీద్ భగత్ సేవాదళ్ కు చెందిన సంస్థలో ఆరీఫ్ ఖాన్ పనిచేస్తున్నాడు. కరోనా రోగులకు ఖాన్ తన చేతనైన సహాయం చేయనున్నాడు. మరోవైపు కరోనాతో మృతి చెందిన రోగులకు అవసరమైతే తన వద్ద ఉన్న డబ్బులు కూడ ఇచ్చేవాడని ఖాన్ సహచర ఉద్యోగులు గుర్తు చేసుకొన్నారు.

ఈ ఏడాది మార్చి నుండి సుమారు 200 మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించే స్మశానవాటికల వద్దకు చేర్చాడు.ఈ కారణంగానే ఆయన తన కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నాడు. 

తన కుటుంబం నివాసం ఉంటున్న  ఇంటికి దూరంగా అంబులెన్స్ పార్కింగ్ వద్దే ఆయన గడిపాడు. కుటుంబసభ్యులతో ఆయన తరచూ ఫోన్ లో మాట్లాడేవాడు. తాను ఇంటికి వెళ్తే వారికి కరోనా సోకుతోందని ఆయన ఇంటికి వెళ్లడం మానేశాడు.

ఈ నెల 3వ తేదీన ఆయన కరోనా బారినపడ్డాడు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరిన మరునాడే ఆసుపత్రిలో మరణించాడు.ఈ ఏడాది మార్చి 21న తన తండ్రిని చూసినట్టుగా ఆయన ఖాన్ పెద్ద కొడుకు ఆదిల్ చెప్పారు. 

ఆయనకు బట్టలు ఇచ్చేందుకు వచ్చిన సమయంలో అప్పుడప్పుడూ కలిసే ప్రయత్నం చేశామన్నారు. ఆయన గురించి ఎప్పుడూ తాము ఆందోళన చెందేవాళ్లమన్నారు. అతను చివరిసారిగా ఇంటికి వచ్చిన సమయంలో అనారోగ్యంతో ఉన్నాడన్నారు.

తన తండ్రి లేకుండా తాము ఎలా బతుకుతామని కొడుకులు ఆవేదన చెందారు. కనీసం ఆయనను కడసారి కూడ తాము సరిగా చూసుకోలేదని  వారు ఆవేదన చెందారు.ఖాన్ కు ప్రతి నెల రూ. 16 వేల జీతం ఇచ్చేవారు. ఖాన్ కుటుంబం నివాసం ఉంటున్న  ఇంటి అద్దె రూ. 9 వేలు. ఖాన్ ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేయడం లేదు.