తనను ఇంటి వెనక ఉన్న ఓ షెడ్డులో పడేశారని.. కనీసం తిండి కూడా పెట్టడం లేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ యాదవ్ ఆరోపించారు. లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్యకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కాగా... పెళ్లి జరిగిన కొన్ని నెలలకే తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ కోర్టును ఆశ్రయించాడు. ఇంట్లో వాళ్లు బలవంతం చేస్తున్నారని ఏకంగా ఇళ్లు వదిలి కూడా పారిపోయాడు.

కాగా... తాజాగా ఆయన భార్య ఐశ్వర్య మీడియాతో మాట్లాడారు. ఔట్ హోస్ లోపల ఉన్న ఓ షడ్డులో తనని పడేశారని ఆమె చెప్పారు. మూడు నెలలుగా తనను చాలా హీనంగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను కనీసం వంటింట్లో కూడా అడుగుపెట్టనివ్వడం లేదని ఆమె తెలిపారు. తన పుట్టింటి నుంచే తనకు భోజనం వస్తున్నట్లు ఆమె తెలిపారు.

తన ఆడపడచు కారణంగానే భర్త తేజ్ ప్రతాప్ యాదవ్ తనతో గొడవలు పడుతున్నారని ఆమె చెప్పారు. పెళ్లైనా అత్తారింటికి వెళ్లకుండా తన ఆడపడుచు పుట్టింట్లోనే ఉంటుందని..ఇంట్లో ఒకరితో మరొకరికి గొడవలు పెడుతూ ఉంటుందని ఆమె ఆరోపించారు. తన కాపురాన్ని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించానంటూ ఆమె మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.