2008 అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. 38 మందికి మరణ శిక్ష విధించింది. మిగిలిన 11 మంది దోషులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

2008 అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలినవారిలో 38 మందికి మరణ శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA), ఐపీసీ 302 సెక్షన్ల ప్రకారం మరణశిక్షను ఖరారు చేసింది. మిగిలిన 11 మంది దోషులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి పెరోల్‌ అవకాశం లేకుండా తీర్పునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పు వెలువరిస్తూ.. బాంబు పేలుళ్లలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం మంజూరు చేశారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో 49 మందిని దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు ఈ నెల 8వ తేదీన క తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. స‌రైన‌ సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. మొత్తం 77 మంది నిందితులను విచారించిన గుజరాత్ స్పెషల్‌ కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. 

2008 జూలై 26న గంటన్నర వ్యవధిలోనే అహ్మదాబాద్‌ నగరంలో పలు చోట్ల వరుస బాంబు పేలుళ్లు (serial blasts) సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీటిపై న‌మోదైన కేసుల‌కు సంబంధించి గుజరాత్ (Gujarat) పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ద‌ర్యాప్తులో ముందుకు సాగుతూ.. 78 మందిపై విచారణ కొనసాగించారు. 78 మంది నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మార‌డ‌తో పేలుళ్ల వేనుకు ఉన్న‌వారి గురించి వెలుగులోకి వచ్చింది. ఈ క్ర‌మంలోనే నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఇక డిసెంబర్‌ 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. దాదాపు 13 సంవ‌త్స‌రాలు విచార‌ణ సాగించారు.

తీర్పు వాయిదాలు ప‌డుతూ..
గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణ ముగిసింది. గుజరాత్‌ (Gujarat)లో అత్యంత సంచలనం సృష్టించిన వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పును వెలువరించారు. అంతకుముందు, ఈ కేసు తీర్పును ప్రకటించడానికి చాలాసార్లు నోటీసు ఇవ్వబడింది, కానీ వాయిదా పడింది. ఈ పేలుళ్ల‌కు సంబంధించి మొత్తం 35 కేసులు న‌మోదుకాగా, వీటిని ఒక కేసుగా ఏకీకృతం చేసిన తర్వాత విచారణ ప్రారంభమైంది. పేలుళ్లు జరిగిన అహ్మదాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. గుజరాత్‌ (Gujarat) స్పెషల్‌ కోర్ట్‌1,100 మందికి పైగా సాక్షులను విచారించింది.