Asianet News TeluguAsianet News Telugu

అగ్నిపథ్ స్కీమ్ వల్ల యువత కలలు నాశనం - రాహుల్ గాంధీ

అగ్నిపథ్ స్కీమ్ వల్ల యువత కలలు నాశనమయ్యాయని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఉపాధి సమస్యను వీధుల్లో నుంచి పార్లమెంట్ వరకు లేవనెత్తే యువతకు తాము అండగా ఉంటామని చెప్పారు. 

Agnipath scheme destroys the dreams of youth - Rahul Gandhi..ISR
Author
First Published Dec 27, 2023, 12:30 PM IST

అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం అసంఖ్యాక యువత కలలను నాశనం చేసిందని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగ సమస్యను లేవనెత్తే వారికి వీధుల నుంచి పార్లమెంటు వరకు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. బిహార్ లోని చంపారన్ కు చెందిన యువకులతో కలిసి ఆయన ముచ్చటించారు. వారి సమస్యలను విన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు చేశారు. 

‘తాత్కాలిక రిక్రూట్మెంట్’ అందించడానికి తీసుకువచ్చిన అగ్నివీర్ స్కీమ్ ముసుగులో సైన్యం, భారత వైమానిక దళం శాశ్వత నియామక ప్రక్రియను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం అసంఖ్యాక యువత కలలను నాశనం చేసిందని రాహుల్ గాంధీ హిందీలో పేర్కొన్నారు. 'సత్యాగ్రహ భూమి' అనే ఉద్యమం చేపట్టి చంపారన్ నుంచి 1,100 కిలోమీటర్లు నడిచి ఢిల్లీకి చేరుకున్న యువకుల పోరాటాన్ని మీడియా చూపించకపోవడం శోచనీయమన్నారు.

ఉపాధి సమస్యను వీధుల్లో నుంచి పార్లమెంట్ వరకు లేవనెత్తే యువతకు తాము అండగా ఉంటామని రాహుల్ గాంధీ తెలిపారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించింది. దీని ద్వారా 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతను కేవలం నాలుగేళ్ల పాటు మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతిభ కనబర్చిన వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటు కల్పించారు. 

ఈ పథకానికి కేంద్రం ఆమోదం తెలపడంతో పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పథకాన్ని సవాలు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిన్నంటినీ 2022 జూలై 19న సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.  అయితే ఈ స్కీమ్ ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. మళ్లీ ఈ తీర్పును సవాల్ చేస్తూ రెంటు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ లో సమర్థించింది. ఈ పథకం ఏకపక్షం కాదని కూడా కోర్టు పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios