జైపూర్:ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లో వెరైటీగా చేసుకోవాలని భావించిన ఓ పోలీస్ అధికారికి  స్వంత శాఖ నుండే షాక్ తగిలింది.  ఫోటో షూట్‌లో ఆయన పోలీస్ డ్రెస్ తోనే వివాదాస్పదంగా ఫోటో షూట్ చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకొంది.

 రాజస్థాన్ కు చెందిన ఎస్‌ఐ  ధన్‌వత్ సింగ్ కు కుటుంబసభ్యులు పెళ్లి నిర్ణయించారు. తనకు కాబోయే భార్యతో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌ను మూడు నెలల క్రితం షూట్ చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తనకు కాబోయే భార్య స్కూటీపై హెల్మెట్ లేకుండా వెళ్తుండగా ధన్‌వత్ సింగ్ పోలీస్ డ్రెస్ లో ఆమెను ఆపి ఫైన్ వసూలు చేస్తాడు.  అయితే ఆ యువతి ధన్‌వత్ సింగ్ జేబులో  కొంత నగదును పెట్టి  వెళ్లిపోతుంది. ధన్‌వత్ సింగ్ ఆ సమయంలో పోలీస్ యూనిఫాంలోనే ఉంటాడు. ఈ వీడియోలు, ఫోటోలు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి.

యూనిఫాంలో ఉండి లంచం తీసుకొనేలా ఈ వీడియో ఉందని ఉన్నతాధికారులు ధన్‌వత్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఐజీ హవా సింగ్ గుమారియా తెలిపారు.

తాను పోలీస్ యూనిఫాంలో ఉన్న వీడియోను మాత్రమే రికార్డు చేయాలని  వీడియో గ్రాఫర్ కు చెప్పినట్టుగా  ఎస్ఐ ధన్‌వత్ సింగ్ చెప్పారు. పూర్తి వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు.