న్యూఢిల్లీ: భారత వింగ్ కమాండర్  అభినందన్ వర్ధమాన్  మళ్లీ విధుల్లో చేరారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  చీఫ్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని సోమవారంనాడు నడిపారు.

ఎయిర్‌ చీఫ్ మార్షల్ ధనోవా కూడ మిగ్-21  పైలెట్ గా పనిచేశాడు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో మిగ్ -21 యుద్ధ విమానాన్ని ధనోవా నడిపాడు. ఆనాడు పాక్ సేనలకు ధనోవా వణుకు పుట్టించాడు. సోమవారం నాడు అభినందన్‌తో కలిసి ఆయన మిగ్-21లో ప్రయాణించాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని అభినందన్ కూల్చేశాడు. అయితే ఆయన నడుపుతున్న మిగ్-21 ఫైటర్ పాక్  ఆక్రమిత కాశ్మీర్ లో కూలిపోయింది. 

ఆ తర్వాత ఆయనను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకొన్నారు.భారత్ కు చెందిన  సమాచారాన్ని ఇవ్వాలని కూడ అభినందన్ ను పాక్ సైనికులు ప్రశ్నించారు. కానీ, అభినందన్ మాత్రం వారికి సమాచారం ఇవ్వలేదు. అభినందన్ వర్ధమాన్ కు భారత ప్రభుత్వం వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.