హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి బలమూ లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆప్ అధికారం చేపట్టడం సాధ్యం కాదని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఎలాంటి పట్టు లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావమూ చూపదని తెలిపారు. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో సంసద్ మొబైల్ స్వాస్త్య (SMS) సేవ నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై అభిప్రాయం చెప్పాలని మీడియా కేంద్ర మంత్రిని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) ఎలాంటి ప్రాబల్యం లేదని అన్నారు. అయినా కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది అని తెలిపారు. ‘‘వారికి ఇక్కడ గ్రౌండ్ లేదు. వారి యూనిట్ పూర్తి అయ్యింది ’’ అని అన్నారు.
గత సోమవారం AAP సోమవారం హిమాచల్ ప్రదేశ్ వర్కింగ్ కమిటీని రద్దు చేసింది. అంతకు ముందే ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మమతా ఠాకూర్‌తో సహా మరి కొంత మంది నాయకులు బీజేపీలో చేరారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు వెళ్లే కొత్త రాష్ట్ర కార్యవర్గం త్వరలో పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ‘‘ హిమాచల్ ప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రద్దు చేయబడింది. కొత్త రాష్ట్ర కార్యవర్గం త్వరలో పునర్వ్యవస్థీకరించబడుతుంది ’’అని సత్యేందర్ జైన్ ట్వీట్ చేశారు.
గత శుక్రవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఆప్ హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు అనుప్ కేసరి, ప్రధాన కార్యదర్శి (సంస్థ) సతీష్ ఠాకూర్, ఉనా జిల్లా చీఫ్ ఇక్బాల్ సింగ్ లు బీజేపీలో చేరారు. వారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆప్ ను హిమాచల్ ప్రదేశ్ లో కాపాడుకోవడం ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కష్టం అవుతోందని అన్నారు. ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, మహిళలకు బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీ ప్రకటించింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కొండ ప్రాంతంలోని బీజేపీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ పాలనను కాపీ చేస్తోందని ఆరోపించింది.
శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నాయని అన్నారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ఉచిత విద్యుత్, ఇతర ఉచిత పథకాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకున్న తర్వాత సీఎం చేసిన అన్ని ప్రకటనలను బీజేపీ వెనక్కి తీసుకుంటుందని అన్నారు. వారి ఉచ్చులో పడవద్దని ఆయన ప్రజలను కోరారు.
