ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నాడనే నెపంతో 80 ఏళ్ల వృద్ధుడిని అతని సొంత కుటుంబీకులే చేతులు, కాళ్లు కట్టేసి బతికుండగానే పాతిపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. వీరిలో అతని మేనల్లుళ్లు ముగ్గురు ఉన్నారు. సోమవారం ఆ వృద్ధుడిని పూడ్చిపెట్టిన ఐదడుగుల గుంత నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అక్టోబర్ 7న పశ్చిమ ఖాసీ హిల్స్‌‌ గ్రామానికి చెందిన మోరిస్ మారంగర్ అనే వృద్ధుడిని అతని బంధువులు బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఒకరోజు తర్వాత అతని పిల్లలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ప్రధాన నిందితులైన అతని మేనల్లుళ్లు డేనియల్, జేల్స్, డిఫర్‌వెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి రోజు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మోరిస్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి చేతులు అతని వీపుకు, కాళ్లను ఒక సంచికి తగిలించి తాడుతో కట్టేశారు. మేనల్లుళ్లు, మేనకోడలు, ఇతర కుటుంబసభ్యులపై మోరిస్ చేతబడి చేశాడని నిందితులు ఆరోపిస్తున్నారు.

అతని మేనకోడలు మూడు నెలలుగా అనారోగ్యంతో ఉందని చెప్పిన నిందితులు.. మోరిస్ మరణించిన తర్వాత ఆమె తిరిగి కోలుకున్నట్లుగా సాక్ష్యం చూపిస్తున్నారు. పోలీసులు, ఇతర కథనాల ప్రకారం మోరిస్ హత్యలో మొత్తం 18 మంది కుటుంబసభ్యుల ప్రమేయం వుందని తెలుస్తోంది.