లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి స్కార్పియో వాహనంలో తిరిగి వస్తుండగా ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్ కౌశాంబి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం బందువుల ఇంట్లో జరిగిన పెళ్లివేడుకను ముగించుకుని ఓ మదిమంది తమ స్వస్థలానికి స్కార్పియో వాహనంలో బయలుదేరారు. అయితే తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ఇసుక లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను కూడా వాహనంలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న పదిమందిలో ఎనిమిది మంది మృతిచెందగా కేవలం ఇద్దరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా శుభకార్యానికి వెళ్లిన వారు మృతదేహాలుగా తిరిగి రావడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నిండింది.