వారంతా దైవ దర్శనం కోసం వచ్చారు. దర్శనానికి ముందు పుణ్య స్నానాలు ఆచరించాలని అనుకున్నారు. తెల్లవారు జామున పుణ్య స్నానం చేసి ఆ తర్వాత దేవుడి దర్శించుకోవాలని భావించారు. అందులో భాగంగా గంగా నది తీరం వద్ద నిద్రించారు. కానీ... దైవ దర్శనానికి ముందే మృత్యు దేవత వారికి కబలించింది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను హరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలోని నరౌరా ఘాట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బులంద్ షహర్ నగరంలో గంగా నదీ తీరంలోని నరౌరా ఘాట్ లో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. 

వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వేగంగా వచ్చిన బస్సు ఘాట్ వద్ద రోడ్డు పక్కన నిద్రపోతున్న భక్తులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. బస్సు ప్రమాద ఘటన అనంతరం డ్రైవరు బస్సు వదిలి పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు బస్సు డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.