మృత్యుంజయుడు: 100 అడుగుల బోరు బావి నుంచి బాలుడి వెలికితీత
100 అడుగుల బోరు బావిలో పడిన ఓ బాలుడు క్షేమంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు
100 అడుగుల బోరు బావిలో పడిన ఓ బాలుడు క్షేమంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర సమీపంలోని షేర్‌ఘర్ గ్రామంలో ఐదేళ్ల బాలుడు ప్రవీణ చెట్లు నుంచి పండ్లు కోస్తూ పొరపాటున బోరు బావిలో పడ్డాడు.
బోరు బావి నుంచి అరుపులు వస్తుండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీకి సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. 100 అడుగుల బావికి సమాంతరంగా గొయ్యి తవ్వడంతో పాటు చిన్నారికి పైప్ ద్వారా ఆక్సిజన్ అందించారు.
ఎనిమిది గంటల పాటు శ్రమించి బాలుడిని ఆదివారం ఉదయం సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని మధుర చీఫ్ మెడికల్ అధికారి షేర్ సింగ్ తెలిపారు.
నిరుపయోగంగా ఉన్న బోరుబావి చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.