తన ప్రేమను కాదన్న యువతి ప్రాణాన్ని తీయడమో లేదంటే ఆమె కుటుంబాన్ని అంతం చేయడానికి సైతం వెనుకాడటం లేదు కొందరు. తాజాగా ప్రియురాలి కుటుంబంపై కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. 

వివరాల్లోకి వెళితే .. ముంబై, మాణిక్‌పూర్‌కు చెందిన రాహుల్‌ పాశ్వాన్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి కుటుంబం రాహుల్‌ను హెచ్చరించింది.

దీంతో ఆగ్రహానికి గురైన అతడు సెప్టెంబర్‌ 10వ తేదీన తన ప్రియురాలి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించి పారిపోయాడు. తొలుత షాపునకు నిప్పంటుకోవటానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ అని భావించారంతా.

అయితే అనుమానం వచ్చిన ఆ యువతి తండ్రి సెప్టెంబర్‌ 21వ తేదీన తన షాపునకు దగ్గరలోని మరో దుకాణంలోని సీసీ టీవీ కెమెరా ఫొటేజీలను పరిశీలించగా అసలు నిజం తెలిసింది.

రాహుల్‌ షాపులోకి నిప్పును పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాహుల్‌ కోసం గాలిస్తున్నారు.