మధ్యప్రదేశ్ లో 108 అడుగుల భారీ ఆది శంకరాచార్య విగ్రహం ఆవిష్కరణ.. విశేషాలేమిటంటే ?
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో మందతా పర్వతంపై ఏర్పాటు చేసిన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఆవిష్కరించారు. దీని బరువు 100 టన్నులు ఉండగా.. అందులో 88 శాతం రాగి, 4 శాతం జింక్, 8 శాతం తగరంతో నిర్మించారు.

మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని మందతా పర్వతంపై ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ ఆది శంకరాచార్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఉదయం ఆవిష్కరించారు. బహుళ లోహంతో తయారు చేసిన ఈ భారీ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ వన్ నెస్’ అనే పేరు పెట్టారు. ఈ విగ్రహ ఆవిష్కరణతో పాటు అద్వైత లోక్ మ్యూజియానికి కూడా చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ మహత్తర మత కార్యక్రమంలో అవదేశానంద్ గిరి మహారాజ్ (జునా అఖాడా ఆచార్య మహామండలేశ్వర్), పరమాత్మానంద్ జీ, స్వామి స్వరూపానంద్ జీ, స్వామి తీర్థానంద్ జీ మహరాజ్ సహా దేశవ్యాప్తంగా 5,000 మంది హిందూ సాధువులు పాల్గొన్నారు.
ఎనిమిదో శతాబ్దపు భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త అయిన ఆదిశంకరాచార్యుడిని 12 సంవత్సరాల బాలుడిగా (గురువు నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వయస్సు) చిత్రీకరించే ఏకత్వ విగ్రహం 75 అడుగుల పీఠంపై నిలబడి రాతితో చేసిన 16 అడుగుల తామరపై ప్రతిష్ఠించబడింది.
శిల్పి భగవాన్ రాంపురే, చిత్రకారుడు వాసుదేవ్ కామత్ మార్గదర్శకత్వంలో చెక్కిన 100 టన్నుల విగ్రహాన్ని 88 శాతం రాగి, 4 శాతం జింక్, 8 శాతం తగరంతో తయారు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓంకారేశ్వర్ ఆలయం (12 జ్యోతిర్లింగాలలో ఒకదానికి నిలయం) ఉన్న మందతా పర్బత్ పై భాగంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఓంకారేశ్వర్ ఆలయం పట్టణంలోని మందతా పర్బత్ నర్మదా నది ఒడ్డున ఉంది.
ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం శివరాగ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆదిగురు శంకరాచార్యుడు దేశాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఏకం చేశారని కొనియాడారు. ఆయన దేశంలోని నలు మూలల్లోనూ మఠాలను స్థాపించి, అద్వైత వేదాంత సిద్ధాంతం ద్వారా దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు.