బంగారం పోయిందనో.. డబ్బులు పోయాయనో.. లేదా ఇంకేదైనా విలువైన వస్తువు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం గురించి మీరు వినే ఉంటారు. అయితే.. ఇక్కడ ఓ వ్యక్తి.. ఏకంగా తన హృదయం పోయిందని.. దానిని ఓ అమ్మాయి దోచుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత.. అరుదైన సంఘటన  నాగపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ యువకుడు నాగపూర్ లోని ఓ పోలీస్ స్టేషన్ కి వచ్చి.. ఓ కంప్లైయింట్ ఇచ్చాడు. ఓ అమ్మాయి తన హృదయాన్ని దోచుకుందని ఫిర్యాదు చేశాడు. అయితే.. ఆ కేసును ఎలా ఫైల్ చేయాలో అర్థం కాక.. ఆ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది తలబాదుకున్నారు. ఈ విషయంలో.. తమ ఉన్నతాధికారులను కూడా సంప్రదించారు. వారు కూడా మాకు తెలీదంటూ చేతలు ఎత్తేశారు.

ఇంకేముంది.. సదరు యువకుడితో మాట్లాడి నచ్చచెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు తమ పరిధిలోకి రాలేదని.. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో కూడా తెలియడం లేదన్నారు. అందుకే.. ఈ కేసును ఫైల్ చేయలేమని చెప్పడంతో ఆ యువకుడు వెనుదిరిగాడు.

ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి స్పందించారు. వస్తువులు పోయాయంటే.. వెతికి పెట్టగలం కానీ.. హృదయాన్ని మేమెలా వెతికిపెడతామన్నారు. గత నెలలో దొంగలు దోచుకువెళ్లిన దాదాపు రూ.82లక్షల సొత్తును పట్టుకొని.. వాటి యజమానులకు అప్పగించామని చెప్పారు. అప్పుడప్పుడు ఇలాంటి వింత కేసులు కూడా తగులుతూ ఉంటాయని అభిప్రాయపడ్డారు.