ప్రధాని నరేంద్రమోదీని.. మంగళవారం నోబెల్ బహుమతి గెలుచుకున్న భారతీయుడు అభిజిత్ బెనర్జీ కలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.  అభిజిత్‌ను కలవడం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మానవ సాధికారత కోసం కచ్చితమైన లక్ష్యాలతో అభిజిత్ పనిచేస్తున్నారని ప్రధాని అన్నారు. 

అనేక అంశాలపై తాము ఈ సందర్భంగా చర్చించామని ఆయన అన్నారు.  అభిజిత్ సాధించిన ఘనత దేశానికే గర్వకారణమని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ అభిజిత్ చేపట్టే ప్రాజెక్టులు సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారుజ   ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం అభిజిత్ సూచించిన ప్రణాళికలను నోబెల్ కమిటీ గుర్తించింది. 

అయితే బీజేపీ ప్రభుత్వ విధానాన్ని అభిజిత్ తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు నోబెల్ విజేతపైన కూడా విమర్శలు చేశారు. ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల ప్రజలు మోదీని ఎన్నుకున్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బెనర్జీ తెలిపారు.

కాగా... అభిజిత్... ఫిబ్ర‌వ‌రి 21, 1961లో అభిజిత్ ముంబైలో జ‌న్మించారు. కోల్‌క‌త్తా వ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. జ‌వ‌హ‌ర్‌లాస్ వ‌ర్సిటీ నుంచి పీజీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. క్యాంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫోర్డ్ ఫౌండేష‌న్‌లో ఆర్థిక‌శాస్త్ర ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. 

2003లో అబ్దుల్ ల‌తీఫ్ జ‌మీల్ పావ‌ర్టీ యాక్ష‌న్ ల్యాబ్‌ను అభిజిత్ ప్రారంభించారు. దాంట్లో డుఫ్లో, సెంథిల్ ములైనాథ‌న్‌లు కూడా ఉన్నారు. ఆ ప‌రిశోధ‌న‌శాల‌కు అభిజిత్ డైర‌క్ట‌ర్‌గా ఉన్నారు. యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌లోని డెవ‌ల‌ప్‌మెంట్ ఎజెండాలోనూ అభిజిత్ స‌భ్యుడిగా ఉన్నారు. 

అభిజిత్ భార్యే ఈస్త‌ర్ డుఫ్లో. ఈమెకు కూడా నోబెల్ క‌మిటీ అవార్డు ఇచ్చింది. అభిజిత్ వ‌ద్దే డుఫ్లో పీహెచ్‌డీ చేసింది. ఆర్థిక‌శాస్త్రం కేట‌గిరీలో నోబెల్ అందుకున్న రెండ‌వ మ‌హిళ‌గా డుఫ్లో రికార్డు క్రియేట్ చేసింది. నోబెల్ అందుకున్న అతిపిన్న వ‌య‌సున్న మ‌హిళ‌గా కూడా ఆమె ఘ‌న‌త సాధించింది.