Sridevi Shoban Babu Review: 'శ్రీదేవి శోభన్ బాబు' మూవీ రివ్యూ
యువ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈ సంక్రాంతికి సంతోష్ శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' చిత్రం విడుదలై నిరాశపరిచింది. ఇప్పుడు శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది.
యువ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ పడడం లేదు. ఈ సంక్రాంతికి సంతోష్ శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' చిత్రం విడుదలై నిరాశపరిచింది. ఇప్పుడు శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. ప్రశాంత్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. సంతోష్ శోభన్ కి జోడిగా యంగ్ బ్యూటీ గౌరి కిషన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ చిత్రంలో నాగబాబు, రోహిణి అన్నా చెల్లెళ్లుగా నటించారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. తన చెల్లిని విడిచి ఉండలేక నాగబాబు.. రోహిణికి ఇల్లరికం వచ్చే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రోహిణి కొడుకు శోభన్ బాబు( సంతోష్ శోభన్).. నాగబాబు కుమార్తె శ్రీదేవి( గౌరి కిషన్) బావ మరదళ్ళు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటేనే వారికి వారసత్వంగా వస్తున్న ఇల్లు దక్కుతుంది అని లేకుంటే అనాధాశ్రమానికి చెందుతుంది అని వాళ్ళ తాత వీలునామా రాస్తారు.
కానీ శ్రీదేవికి, శోభన్ బాబుకి పడదు. కానీ ఒక సందర్భంలో శ్రీదేవి శోభన్ బాబు ప్రేమలో పడుతుంది. నాగబాబు, రోహిణి కుటుంబాల మధ్య ఉన్న సమస్య ఏంటి ? శ్రీదేవి శోభన్ బాబు పెళ్లి చేసుకుని ఇంటిని కాపాడుకున్నారా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన అంశం.
విశ్లేషణ :
ఈ చిత్రంలో సంతోష్ శోభన్ నార్మల్ విలేజ్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతడికి ఈ తరహా రోల్ అలవాటేనా అనేంతగా మంచి జోష్ తో చేశాడు. సంతోష్ కామెడీ టైమింగ్ బావుంది. హీరోయిన్ గౌరి కిషన్ కూడా గుడ్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే మంచి నటన కనబరిచింది. తన పాత్రకు వరకు న్యాయం చేసింది.
ఇతర నటీనటులు నాగబాబు, రోహిణి కూడా తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. సంతోష్, గౌరి మధ్య కెమిస్ట్రీ బావుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటి కథలు చాలా సార్లు చూశాం. కానీ రొటీన్ ఫ్యామిలీ కథ అయినప్పటికీ ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉంటే ప్రేక్షకులని మెప్పించవచ్చు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కొన్ని డైలాగ్స్ , క్లైమాక్స్ మాత్రమే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు. మిగిలినవన్నీ దర్శకుడు గాలికి వదిలేశారు.
ఫస్ట్ హాఫ్ నుంచే బోరింగ్ సీన్లు మొదలవుతాయి. ప్రేక్షకుల ఓపికకి పరీక్ష పెడుతాయి. దర్శకుడు అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు పెట్టాడు తప్ప.. స్క్రిప్ట్ ని ఒక ఫ్లోలో సిద్ధం చేసుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఐతే పరమ రొటీన్ గా ఉంటాయి. డ్రామా శృతి మించినట్లుగా అనిపిస్తాయి. శ్రీదేవి శోభన్ బాబు చిత్రం అన్ని విభాగాల్లో ఫెయిల్యూర్ ఐన మూవీ గా చెప్పొచ్చు.
టెక్నికల్ గా:
సిద్దార్థ్ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. కథ కథనాలు సరిగ్గా లేకపోవడంతో టెక్నికల్ గా కూడా ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. కమ్రాన్ అందించిన సంగీత ఒకే.. రెండు పాటలు బావున్నాయి. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త పనితనం చూపించాల్సింది. ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాల నిడివి తగ్గించి ఉండొచ్చు. ఈ చిత్రానికి రెండు గంటలకు పైగా నిడివి అంటే ప్రేక్షకుల సహనానికి పరీక్షే.
ఇక దర్శకుడు ప్రశాంత్ కుమార్ విషయానికి వస్తే.. నిర్మాతలు తన పై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశాడు. రొటీన్ కథని తీసుకుని స్క్రీన్ ప్లే లో కూడా మ్యాజిక్ చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా, క్లైమాక్స్ పర్వాలేదనిపించే విధంగా ఉంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరే.
ఫైనల్ గా: యువ హీరో సంతోష్ శోభన్ మంచి కథలు ఎంచుకోవడంలో తడబాటు శ్రీదేవి శోభన్ బాబు'తో కూడా కొనసాగింది.