సత్యదేవ్, తమన్నా 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ
కన్నడ సినిమా 'లవ్ మాక్‌టైల్' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం చాలా కాలం రిలీజ్ ఆగుతూ ఆగుతూ వచ్చి ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది (Gurthunda Seethakalam Review)?
ఈ మధ్యకాలంలో ఏ హీరోకు ఇన్ని రిలీజ్ లేవు. వరసపెట్టి సత్యదేవ్ సినిమాలు చేస్తున్నాడు. రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ చిత్రం 'లవ్ మాక్‌టైల్' రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. తమన్నాకూడా ఉండటం...ఆల్రెడీ ఒక భాషలో రిలీజైన హిట్టైన చిత్రం రీమేక్ కావటంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని ఈ సినిమా ఏ మేరకు అందుకోగలిగింది...సినిమా కన్నడంలో తరహాలో హిట్టైందా...అసలు కథేంటి...రీమేక్ చేసేటంత విషయం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
దేవ్ (సత్యదేవ్) కర్ణాటక దగ్గర ఓ హిల్ స్టేషన్ లో దివ్య (మేఘా ఆకాష్) ని కలుస్తాడు. అపరిచితులైన వీళ్లిద్దరు బెంగుళూరు బయిలుదేరతారు. ఈ క్రమంలో తన కథను సత్య ఆమె కు చెప్పటం మొదలెడతాడు. ఆ కథలో సత్యకు కాలేజీలో అమ్ము అలియాస్ అమృత (కావ్యా శెట్టి) పరిచయం. ఆ తర్వాత ప్రేమ, అతనికి డబ్బు లేదని ఆమె దూరం పెట్టడం..అవమానించి బ్రేకప్ చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత దేవ్ జీవితంలోకి నిథి(తమన్నా) వస్తుంది. ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. పెళ్లి చేసుకుంటారు. ఈ లోగా మళ్లీ అమ్ము అతని జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దేవ్ ఓ డెసిషన్ తీసుకుంటాడు. అదేమిటి...అసలు ఈ కథ ను దివ్యకు ఎందుకు చెప్తున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...
కొన్ని ఫీల్ గుడ్ సినిమాలు ఉంటాయి. వాటిని ఆదరించే ప్రేక్షకులు ఉంటారు. కానీ ఫీల్ గుడ్ పేరట బోర్ ని ప్రమోట్ చేస్తే మాత్రం తట్టుకోవటం కష్టమే. తెరపై జరిగేది మనకు తెలిసిపోతుంటుంది. అదీ ఇంట్రస్టింగ్ గా ఉంటే తెలిసినా తట్టుకోగలం. అలా కాకుండా ఎక్కడో చివర్లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని, అక్కడిదాకా లాక్కుంటూ వెళ్దామంటే ప్రేక్షకులు వాళ్లు ఊహించిన ఫీల్ అవుతారో లేదో కానీ ఫీల్ అవుతారనేది మాత్రం నిజం. ముఖ్యంగా ఇలాంటి కథలు గతంలో మనం చూసేయటమే ఈ సినిమాకు పెద్ద అడ్డంకి. దాంతో ఈ సినిమా మనకు బాగా అవుట్ డేటెడ్ గా, సాగతీతగా అనిపించటంలో వింతేమీ లేదు. కన్నడ వాళ్లలో సహన శక్తి ఎక్కువ ఉందేమో అక్కడ పెద్ద హిట్ చేసారు కానీ మనకు ఇక్కడ చూస్తూంటే మనలో ఇంత ఓపిక ఉందా అనిపిస్తుంది. అసలు ఈ సినిమా కన్నడంలో అయినా అంత పెద్ద హిట్ అయ్యిందా అనే సందేహం వస్తుంది. లేకపోతే తెలుగుకు మార్పులే చేసి పాత కాలం డ్రామాలా మార్చేసారా అనిపిస్తుంది. ఫలానా సీన్ బాగుంది అనిపించినవి అరుదుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషన్ కంటెంట్ సినిమాలో వర్కవుట్ కాలేదు. క్లైమాక్స్ కు వచ్చేసరికి హృదయం బరువక్కాలి కానీ..ఎప్పుడు పూర్తవుతుందా వెళ్లిపోదామనిపించింది.
టెక్నికల్ గా...
ఈ సినిమా బోర్ కొట్టడానికి స్క్రిప్టే కారణం. ఫార్ములా లవ్ సీన్స్ ఒకదాని వెనక మరొకటి రావటంతో ఏదీ రిజస్టర్ కాలేదు. ఇది తెలుగు రీమేక్ లో జరిగిన సమస్యో లేక ఒరిజనల్ లో అలా ఉందో చూడాలి. అలాగని మరీ ఏమీ లేదని కాదు..కానీ చెప్పుకునేందుకు ఏదీ గుర్తు రావటం లేదు. డైలాగులు కొన్ని బాగున్నాయి. ఇక కాలభైరవ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకు తగ్గట్లున్నాయి. ఎడిటింగ్ సెకండాఫ్ లో కాస్తంత చేసి ఉంటే బాగుండేది.
నటీనటుల్లో ...
తమన్నా, సత్యదేవ్ ఇద్దరూ తమ పరిధిలో చేసుకుంటూ పోయారు. తమన్నా తన ఇమేజ్ పక్కన పెట్టి చేసింది. ఏం ఫలితం. కావ్యా శెట్టికి కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నం ఉన్నారు ఉన్నారు ..అంతే !
బాగున్నవి
సత్యదేవ్ ఫెరఫార్మెన్స్
కొన్ని రొమాంటిక్ సీన్స్
బాగోలేనివి
ఎమోషన్ లేని ఎమోషన్ సీన్స్
ప్రెజంటేషన్ లో కొత్తదనం లేకపోవటం
ఓవర్ అనిపించిన క్లైమాక్స్
ఫైనల్ థాట్
ఇలాంటి శీతాకాలాలని తెలుగు ప్రేక్షకులు చాలా చూసేసారు. వాళ్లు గుర్తుపెట్టుకోవాలంటే ఇది సరిపోదు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
నటీనటులు : సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం తదితరులు
కథ : కృష్ణ
మాటలు : లక్ష్మీ భూపాల
ఛాయాగ్రహణం : సత్య హెగ్డే
సంగీతం : కాల భైరవ
సమర్పణ : ఎం.ఎస్. రెడ్డి, చినబాబు
నిర్మాతలు : రామారావు చింతపల్లి, నాగ శేఖర్, భావన రవి
దర్శకత్వం : నాగ శేఖర్
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022