Asianet News TeluguAsianet News Telugu

నాగశౌర్య `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` మూవీ రివ్యూ, రేటింగ్‌..

నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Phalana Abbayi Phalana Ammayi movie Review  and rating
Author
First Published Mar 17, 2023, 2:16 PM IST

వరుస పరాజయాల అనంతరం యంగ్‌ హీరో నాగశౌర్య గతేడాది `కృష్ణ వ్రిందా విహారి` చిత్రంతో డీసెంట్‌ హిట్‌ని అందుకున్నాడు. అంతేకాదు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకున్నాడు. మ్యారేజ్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న మూవీ `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`(ఫఫ). `ఊహలు గుసగుసలాడే`, `జ్యో అచ్యుతానంద` వంటి హిట్ల తర్వాత నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితమే ప్రారంభమైంది. కరోనా కారణంగా ఆలస్యమవుతుంది. అయితే కథ కూడా ఏడు ఛాప్టర్లలో సాగుతుందని చెప్పారు దర్శకుడు. కరోనా తమకి కలిసొచ్చిందన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నేడు శుక్రవారం(మార్చి 17న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
`ఫఫ` హీరోహీరోయిన్ల మధ్య ఏడు ఛాప్టర్లలో జరిగిన కథ. సంజయ్‌(నాగశౌర్య) వైజాగ్‌లో బిటెక్‌లో ఫస్ట్ ఇయర్‌ జాయిన్‌ అవుతాడు. సీనియర్ల ర్యాగింగ్‌ నుంచి మరో సీనియర్‌ అయిన అనుపమా(మాళవిక నాయర్‌) కాపాడుతుంది. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది రాను రాను మరింతగా బలపడుతుంది. బిటెక్‌ తర్వాత ఎంఎస్‌ కోసం లండన్‌ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడి ప్రేమలో పడతారు. రిలేషన్‌షిప్‌లోనూ ఉంటారు. వీరి ప్రేమ, రిలేషన్‌ చాలా దూరం వెళ్తుంది. అనుపమా తనకంటే సీనియర్‌ కావడంతో ఆమె కోర్స్ ముందుగానే పూర్తవుతుంది. జాబ్‌ కోసం ప్రయత్నం చేస్తుంది. వేరే సీటీలో జాబ్‌ రావడంతో ఆమె వెళ్లాల్సి వస్తుంది. తనని వదిలి అనుపమా వెళ్లిపోవడం సంజయ్‌కి నచ్చదు. దీంతో ఆమెకి దూరం కావాలనుకుంటాడు. అందుకోసం పూజ(మేఘా చౌదరి) అనే అమ్మాయితో స్నేహం పెంచుకుంటాడు. ఈ క్రమంలో అనుపమా, సంజయ్‌ మధ్య గొడవలవుతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఇద్దరి విడిపోయారా? మళ్లీ కలుసుకున్నారా? వీరిద్దరి జీవితంలోకి గిరి(శ్రీనివాస్‌) అవసరాల ఎందుకొచ్చాడు. సంజయ్‌ని కాదని గిరితో పెళ్లి చేసుకుందా? చివరికి వీరి ప్రేమ ఏ తీరం చేరిందనేది మిగిలిన కథ. 

కథనంః

అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ, రిలేషన్‌షిప్‌, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం క్లుప్తంగా ఈ సినిమా కథ. అన్ని ప్రేమ కథల్లోనూ ఇదే ఎలిమెంట్లు ఉంటాయి. కానీ వాటిని ఎంత కొత్తగా, ఎంత హత్తుకునేలా, ఎంతటి ఫీల్‌గుడ్‌తో, ఎంత ఫన్నీగా, ఎంగేజ్‌ చేసేలా సినిమాని నడిపిస్తారనేది ముఖ్యం. దాన్ని బట్టే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల ఏడు ఛాప్టర్లు అనే కొత్త అంశాన్ని జోడించారు. వీరిద్దరి మధ్య బిటెక్‌ నుంచి జాబ్‌లో సెటిల్‌ కావడం, ఆ తర్వాత వీరి రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణ, మనస్పర్థాలు వంటి అంశాలను ఏడు ఛాప్టర్లుగా విభజించి తెరకెక్కించారు. ఇదొక మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ. చాలా మెచ్యూర్డ్ లవ్‌ స్టోరీ అని చెప్పొచ్చు. అయితే పూర్తిగా మల్టీఫ్లెక్స్, ఫారెన్‌ స్టయిల్‌లో సాగే ప్రేమ కథ. విదేశీ కల్చర్‌ ప్రేమకి మనవైన ఎమోషన్స్ జోడించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల. ఈ విషయంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు. ఎమోషన్స్, ఆయన తాలూకు ఫన్‌ ఆశించిన స్థాయిలో లేదు.

సినిమా కథని, ఇద్దరి మధ్య బాండింగ్‌ని ఏడు దశల్లో చెప్పాలనుకున్నారు, కానీ దాన్ని నడిపించిన తీరు విషయంలో తనే కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు. సినిమా స్లోగా సాగుతుంది. మధ్య మధ్యలో కొంత ఫన్‌, అక్కడక్కడ కొంత ఫీల్‌ కనెక్ట్ అవుతుంది. కానీ అది సినిమా అంతా ట్రావెల్‌ కాదు. మధ్య మధ్యలో ఛాప్టర్లు మారడంతో ఆ కనెక్టివిటీ ఆడియెన్స్ మిస్‌ అవుతారు. ఏ ఛాప్టర్‌ నుంచి ఏ ఛాప్టర్‌కి వెళ్తున్నామనేది అర్థం కావడానికి టైమ్‌ పడుతుంది. ఈ విషయంలో ఆడియెన్స్ ఓపికకి టెస్ట్ పెట్టాడు దర్శకుడు. నిజానికి సెన్సిబుల్‌, ఫీల్‌గుడ్‌ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల ఎక్స్ పర్ట్. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. కానీ ఈ చిత్రంలో మాత్రం ఆయన తడబడ్డాడు. ఏం చెప్పదలుచుకున్నాడనే క్లారిటీ మిస్‌ అయ్యింది. హీరోహీరోయిన్ల మధ్య మనస్పార్థాలు, ఎందుకు గొడవపడ్డారు, ఎందుకు విడిపోయారనే అంశాలను బలంగా చూపించలేకపోయాడు. లైటర్‌ వేలో టచ్‌ చేయడంతో ఆడియెన్స్ కి ఆ అంశాలు సస్పెన్స్ గానే ఉండిపోతాయి. 

సినిమా మొదటి భాగం బాగుంది. కాలేజ్‌ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. ఫ్రెండ్‌షిప్‌, ప్రేమకి సంబంధించిన అంశాలు ప్రతి ఒకరికి తమ గతంలోకి తీసుకెళ్తాయి. కాకపోతే అవన్నీ ఫారెన్‌ స్టయిల్‌లో ఉండటంతో మన ఆడియెన్స్ (బీ, సీ సెంటర్ల)కి కనెక్ట్ కావడం కష్టం. ఓ రకంగా దర్శకుడు నేల విడిచి సాము చేశాడని చెప్పొచ్చు. అయితే ఆయన ఫార్వర్డ్ జనరేషన్‌ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సినిమా తీసినట్టు ఉంటుంది. దీంతో నార్మల్‌ ఆడియెన్స్ ని సినిమా నుంచి దూరం చేసినట్టే అయ్యింది. సినిమాలో ఫీల్‌ మాత్రం బాగుంది. క్లైమాక్స్ లో ఇద్దరి మధ్చ వచ్చే సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. రియలైజేషన్‌ సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ వాటికోసం మిగిలినదంతా ఆడియెన్స్ మర్చిపోయేంత గొప్పగా, బలంగా లేదు. క్లైమాక్స్ పరుగులు పెట్టేలా, మరింత ఇంటెన్స్ గా ఉండి ఉంటే సినిమా ఫలితం ఇంకా బాగుండేది. ఓవరాల్‌గా ఇది మల్టీప్లెక్స్ కి మాత్రమే పరిమితమయ్యే సినిమాగా నిలుస్తుంది. పాటలు సినిమాకి ప్రధాన బలం. సినిమా మొత్తంలో హైలైట్‌ అయ్యే అంశాలు కూడా అవే.

నటీనటులుః 
సంజయ్‌ పాత్రలో నాగశౌర్య తన పాత్రలోని వేరియేషన్స్ బాగా చూపించాడు. ఇన్నోసెంట్‌గా, మెచ్యూర్డ్ గా, లవర్‌ బాయ్‌గా పాత్రలో ఇన్‌వాల్వ్ అయి చేశాడు. ఆయన నటన డీసెంట్‌గా బాగుంది. అనుపమా పాత్రలో మాళవిక చాలా మెచ్యూర్డ్ పర్‌ఫెర్మెన్స్ చూపించింది. ఇంకా చెప్పాలంటే చాలా సీన్స్ లో హీరోని డామినేట్‌ చేసింది. అనేక ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా పలికించింది. వీరిద్దరి చుట్టూతే సినిమా నడుస్తుంది. ఈ ఇద్దరే సినిమాని మోస్తారు. మధ్యలో కొన్ని పాత్రలు వస్తూ పోతుంటాయి. కానీ ఫోకస్‌ అంతా ఈ ఇద్దరే. ఈ విషయంలో ఇద్దరూ తమ భుజాలపై సినిమాని మోశారు. హీరో ఫ్రెండ్‌ వాలెంటైన్‌గా అభిషేక్‌ మహర్షి మెప్పించాడు. ఉన్నంతలో ఆకట్టుకునే పాత్ర ఆయనదే. పూజాగా మేఘా చౌదరి ఓకే అనిపించింది. కీర్తి పాత్రలో శ్రీ విద్య ఫర్వాలేదు. గిరిగా దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కాసేపు మెరిశాడు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు ఓకే అనిపించారు. 

టెక్నీషియన్లుః
సినిమాకి కళ్యాణి మాలిక్‌ సంగీతం ఆయువు పట్టు. సంగీతం కోసమైనా సినిమాని చూడొచ్చు అనేలా ఉన్నాయి. పాటలన్నీ ఆడియెన్స్ ని అలరిస్తాయి. సునీల్‌ కుమార్‌ నామ కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలకు సంబంధించి ఎలాంటి ఢోకా లేదు. కథకు మించి ఖర్చు చేశారని ప్రతి ఫ్రేములోనూ తెలుస్తుంది. సినిమాకి అన్ని బాగున్నాయి. కానీ దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాలే వాటిని సరిగా వాడుకోలేకపోయాడు. ఆయన కథని నడిపించే విధానమే తేడా కొట్టింది. స్లో నెరేషన్‌, ఎమోషన్స్, కనెక్టివిటీ మిస్‌ కావడంతో సినిమాని ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఫీల్‌ కాలేరు. ఓ రొమాంటిక్‌ ఫీల్‌గుడ్‌ మూవీ అనే ఫీల్‌ మిస్‌ అయ్యింది. శ్రీనివాస్‌ అవసరాల సినిమా అంటే ఆడియెన్స్ లో ఓ ఒపీనియన్‌ ఉంటుంది. ఆయనపై ఓ నమ్మకం కూడా ఉంటుంది. దాన్ని డైరెక్టర్ వంద శాతం రీచ్‌ కాలేకపోయాడు. 

ఫైనల్‌గాః ఓపికతో చూడాల్సిన ఫీల్‌గుడ్ మూవీ.
రేటింగ్‌ః 2.5


నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ త‌దిత‌రులు  
కథ, కథనం, మాటలు, ద‌ర్శ‌క‌త్వం : శ్రీనివాస్ అవసరాల 
సంగీతం : కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
ఛాయాగ్రహణం : సునీల్ కుమార్ నామ
నిర్మాత‌లు : టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి, వివేక్ కూచిభొట్ల(సహా నిర్మాత )
విడుదల తేదీ : మార్చి 17, 2023

Follow Us:
Download App:
  • android
  • ios