Asianet News TeluguAsianet News Telugu

Neethone Nenu Movie Review: `నీతోనే నేను` మూవీ రివ్యూ, రేటింగ్‌..

ఈ వారం(అక్టోబర్‌ 13) చిన్న సినిమాల జాతర నెలకొంది. ఏకంగా పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి `నీతోనే నేను` మూవీ. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

neethone nenu movie review and rating arj
Author
First Published Oct 13, 2023, 12:55 PM IST

స్టార్‌ హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలకు ఈవారం కలిసొస్తుంది. దీంతో ఒకేసారి ఐదారు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మళ్లీ ఇలాంటి టైమ్‌ రాదనే ఉద్దేశ్యంతో మేకర్స్ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. అలా ఈ వారం ఏకంగా పదికిపైగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. దీంతో ఈ శుక్రవారం చిన్న సినిమాల జాతర నెలకొందని చెప్పొచ్చు. అలా వచ్చిన చిత్రాల్లో `నీతోనే నేను` అనే సినిమా ఒకటి. వికాస్‌ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. అంజిరామ్‌ దర్శకత్వం వహించారు. శ్రీ మామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. శుక్రవారం(అక్టోబర్‌ 13)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 
రామ్‌( వికాష్‌ వశిష్ట) గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్. మంచితనానికి మారు పేరు. పేద విద్యార్థులకు సహాయం చేస్తుంటాడు. ఆయన బదిలీపై మెదక్‌ జిల్లా లక్ష్మాపూర్‌ ప్రభుత్వ స్కూల్‌కి వస్తాడు. పీఈజీ టీచర్‌గా ఆయేషా(కుషిత) కూడా అదే రోజు జాయిన్‌ అవుతుంది. ఈ ఇద్దరు పేద విద్యార్థుల కోసం పాటుపడుతుంటారు. విద్యార్థుల సమస్యలను తీరుస్తుంటారు. ఆ స్కూల్‌లో టాయిలెట్లు లేకపోవడంతో దాన్ని పర్సనల్‌గా తీసుకుని కలెక్టర్ ద్వారా విద్యార్థులకు టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తారు. ఈ క్రమంలో తనలాంటి ఆలోచనలో ఉన్న రామ్‌ సర్‌ని ఆయేషా ఇష్టపడుతుంది. అతనికి లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంది. కానీ ఆమె ప్రేమని తిరస్కరిస్తాడు రామ్‌. తనకు పెళ్లైందని, సీత అనే భార్య ఉందని చెబుతాడు. దీంతో ఆమెని చూసేందుకు రామ్‌ ఇంటికి వెళ్తుంది ఆయేషా. కానీ తీరా అక్కడికి వెళ్లాక రామ్‌ని చూసి ఆయేషా షాక్‌ అవుతుంది. రామ్‌ ఒక సైకలాజికల్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుసుకుంటుంది. మరి రామ్‌కి ఉన్న సమస్య ఏంటి? దానికి కారణం ఏంటి? రామ్‌కి నిజంగానే పెళ్లి అయ్యిందా? సీత ఎవరు? అసలు కథేంటి? అనేది మిగిలిన సినిమా. 

విశ్లేషణః 
గురువు గొప్పదనం చెప్పే చిత్రాలు అడపాదడపా వస్తుంటాయి. ఓ రకంగా చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి చిత్రాలకు ఆదరణ చాలా తక్కువ. ఒకప్పుడు అంటే ఓకే, ఇప్పుడు కాలం మారింది, కల్చర్‌ మారింది, స్టడీ మారింది. దీంతో మంచి గురువులను, అలాంటి సినిమాలను ఆడియెన్స్ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆ మధ్య వచ్చిన ధనుష్‌`సార్‌`కి మాత్రం పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు గురువు గొప్పతనం చెప్పే కథతో `నీతోనే నేను` అనే చిత్రం రూపొందింది. ఇందులో సైకలాజికల్‌ డ్రామా ఉంటుంది. లవ్‌, ఎమోషన్స్ ఇలా అన్ని మేళవించి తెరకెక్కించాడు. గురువు గొప్పతనం చెప్పే ఎపిసోడ్‌ కాస్త ఓల్డ్ గానే ఉన్నా, హీరో జీవితంలోని విషాదం మాత్రం ఎమోషనల్‌గా ఉంటుంది. 

సినిమా ప్రారంభంలో.. రామ్‌ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్‌ చేశారు. ఆయన మంచితనాన్ని, పేద విద్యార్థులకు సహాయం చేయడం, స్కూల్‌ బాగుకోసం పాటుపడటం, ఇతర టీచర్లు నిర్లక్ష్యంగా ఉన్నా, తనే బాధ్యత తీసుకుని వారి డౌట్స్ క్లీయర్ చేస్తూ, తన సబ్జెక్ట్ కాకపోయిన మ్యాథ్స్ లో డౌట్స్ చెబుతూ స్టూడెంట్స్ ని మంచి స్థాయికి తీసుకురావాలనే అంశాలు ముచ్చటగా ఉంటాయి. ప్రభుత్వ స్కూల్‌లో ఉండే సమస్యలను, టాయిలెట్లు లేకపోవడం వల్ల ఆడపిల్లలు టాయిలెట్‌ వస్తుందని చెప్పి వాటర్‌ తాగకపోవడం వంటి సీన్లు గుండెని బరువెక్కిస్తాఇ. అలాగే రామ్‌ని పీఈటీ టీచర్‌ ఇష్టపడటం వంటి సీన్లు అలరిస్తాయి. ఇక లేని భార్యని ఊహించుకుని తాను మానసికంగా బాధపడే సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. 

హీరోలోని ట్రాజెడీ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుంది. హీరో గతం తెలిసి ఆయేషా తీసుకున్న నిర్ణయం పెద్ద ట్విస్ట్. అంతకు వరకు సరదాగా సాగిన సినిమా ఆ తర్వాత ఎమోషనల్‌ ట్రాక్‌ తీసుకుంటుంది. అయితే చాలా వరకు సినిమాలో సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి. గతంలో చాలా సార్లు చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. హీరోయిన్‌ ట్విస్ట్ కూడా అంతగా కిక్‌ ఇచ్చేలా ఉండదు. ఆ విషయాలపై మరింత ఫోకస్‌ పెడితే బాగుండేది. సినిమా స్లో నెరేషన్‌ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అయితే ఇలా ప్రభుత్వ స్కూల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఇలాంటి సినిమా రావడం కొత్తగా ఉంటుంది. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్లుః
రామ్‌ పాత్రలో వికాస్‌ వశిష్ట ఒదిగిపోయాడు. లవర్‌గా, టీచర్‌గా మెప్పించాడు. హుందాగా నటించాడు. టీచర్లు ఎలా ఉండాలో ఆయన పాత్ర ద్వారా చెప్పిన తీరు బాగుంది. అలాగే మానసికంగా ఇబ్బంది పడే సీన్లలోనూ ఆయన నటన బాగుంది. పీఈటీ టీచర్‌గా కుషిత అందంగా ఉంది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. మరోవైపు సీత పాత్రలో మోక్ష కాసేపు ఉన్నా అలరిస్తుంది. ఆమె కూడా హుందాగా చేసింది. ఇక ఇతర టీచర్లు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా చూస్తే  మరళీ మోహన్‌ విజువల్స్ బాగున్నాయి.  అలాగే కార్తీక్‌ బి కడగంట్ల మ్యూజిక్‌ బాగుంది. గురువు గొప్పతనం చెప్పే పాట, బ్యాక్‌ గ్రౌండ్‌ వచ్చే సాంగ్‌ హంట్‌ చేసేలా ఉన్నాయి. దర్శకుడు అంజిరామ్‌ మంచి ప్రయత్నం చేశాడు, మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాకపోతే నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కథ, కథనం రాసుకుని తెరకెక్కించి ఉంటే బాగుండేది. 

ఫైనల్‌గాః ఓవరాల్‌గా జస్ట్ ఓకే అనిపించే మూవీ `నీతోనే నేను`. 
రేటింగ్‌ః 2.5
 

Follow Us:
Download App:
  • android
  • ios