మైత్రీ మూవీస్ 'సత్తి గాని రెండెకరాలు' రివ్యూ
జగదీష్ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా వచ్చింది. అదే 'సత్తి గాని రెండు ఎకరాలు'. ఈ సినిమా ఆహాలో మే 26న విడుదలైంది.
మైత్రీమూవీస్ వంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. ఏదో పనికొచ్చే కంటెంట్ లేకపోతే వాళ్లు ఖర్చు పెట్టి చిన్న ఓటిటి సినిమా చేయరని నమ్మకం. దానికి తోడు ఇందులో 'పుష్ప' సినిమాతో కేశవ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ ప్రతాప్ బండారికఅందులో నటించటం కూడా కలిసొచ్చింది. వెన్నెల కిషోర్ వంటి కమిడియన్ ఫుల్ లెంగ్త్ రోల్ చేయటం..ఇవన్నీ సినిమా పై ఆసక్తిని, అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది. సినిమా లో ఫన్ బాగా పండిందా..కథ ఏంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ:
సత్తి(జగదీష్ ప్రతాప్ బండారి) దగ్గర నుంచి వాళ్ల తాత చిన్నప్పుడు ఓ మాట తీసుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా.. ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని . కానీ అతని పరిస్దితులు ఆ రెండు ఎకరాలు అమ్మేస్తే కానీ తీరని సమస్యలు తెచ్చి పెడతాయి. చంటి బిడ్డ అయిన కూతురుకి గుండె జబ్బు రావటంతో వైద్యం కోసం ఏం చేయాలో అర్దం కాక ఆ రెండు ఎకరాలు వైపే చూస్తాడు. ఈలోగా భగవంతుడు పంపినట్లుగా ఆ ఊరికో కారు రావటం...అది చెట్టుకు ఢీకొనటం. జరుగుతుంది. అది సత్తి కళ్ల పడుతుంది. దాంతో సత్తి కారు దగ్గరకు వెళ్తాడు. వెనక సీట్ లో సూట్ కేస్ ఉంటే దాన్ని తీసుకుంటాడు. ఆ సూటుకేసులో డబ్బులు ఉంటే కుమార్తెకు ఆపరేషన్ చేయించొచ్చు అని ఆలోచన. కానీ అది ఎలా తెరవాలని మాత్రం సత్తికి తెలియదు. అక్కడ నుంచి ఆ సూటుకేసుని పట్టుకుని తిరుగుతూంటాడు. మరో ప్రక్క ఆ కారుకి చెందిన వ్యక్తి..ఎంక్వైరీ కు మనిషి(వెన్నెల కిషోర్) ని పంపుతాడు. ఈ లోగా ఆ కారు ప్రమాదం గురించి తెలిసిన లోకల్ ఎస్సై(బిత్తిరి సత్తి) ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ సూటుకేసు తెరుచుకుందా..అందులో ఏమి ఉన్నాయి... సత్తి రెండు ఎకరాలు అమ్మేశాడా? సత్తి కూతురుకి ఆపరేషన్ అయిందా? వంటి విషయాలు తెలియాలంటే సత్తి గాని రెండు ఎకరాలు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
పెద్ద తెరపై చెప్పలేని చాలా కథలు ఓటిటి వేదికగా చెప్పవచ్చు. అందుకు అవకాసం కల్పిస్తున్నాయి ఓటిటి ప్లాట్ ఫామ్ లు. అయితే అక్కడ చూసేది కూడా పెద్ద తెర మీద సినిమాలు చూసే ప్రేక్షకులే అనే విషయం మర్చిపోకూడదు. ఆ ఆడియన్స్ ఎక్కడ నుంచో ప్రత్యేకంగా రారు. కానీ ఈ విషయం గుర్తు పెట్టుకోవటం లేదు ఓటిటి తీసే దర్శక,నిర్మాతలు. మళయాళంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఓటిటి సినిమాలు వస్తూంటే ఇక్కడ చెప్పుకోదగ్గ ఓటిటి ఒరిజనల్ సినిమాలు రావటం లేదు. ఇక ఈ సినిమా తెలంగాణా విలేజ్ నేపధ్యంలో సాగే ఓ క్రైమ్ కామెడీ. దర్శకుడు కొన్ని వాస్తవిక పాత్రలను, ఎసెంట్రిక్ గా ఉండే ప్రవర్తనలను పట్టుకుని బ్లాక్ కామెడీలా కథ,కథనం నడిపే ప్రయత్నం చేసాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఎంచుకున్న స్టోరీ లైనే ...సినిమా పుట్టిన కాలం నాటిది. చాలా సినిమాల్లో ఇలాంటి సిల్లీ కథా నేపధ్యాలను చూసి ఉన్నాం. అయితే ఏమిటి ..వాటికి ఈ సత్తిగాని రెండు ఎకరాలకు కు తేడా అంటే తెలంగాణా పల్లె నేపధ్యంలో కథ చెప్పటమే.
కథలో ప్రధాన పాత్ర (హీరో)కు సూట్ కేసు దొరకటంతో మలుపు వస్తుంది. అక్కడ నుంచి కథ పరుగెత్తాలి. కానీ అలాంటిదేమీ జరగదు. అలాగే స్లోగా , ముందుకు వెళ్దామా వద్దా అన్నట్లు కథ ముందుకెళ్తుంటుంది. ఎందుకంత స్లో నేరేషన్ లో సినిమా తీసారో అర్దం కాదు. అలాగే అక్కడక్కడా చిన్న చిన్న చమక్కులు దర్శకుడు ట్రై చేసాడు. కానీ క్రైమ్ కామెడీ తరహాలో కంటిన్యూ ఫన్ ఎక్సపెక్ట్ చేయటానికి లేదు. మొదటి మలుపు తర్వాత సినిమా అంతకు మించి ఎక్కడా అంతకు మించిన మలుపు ఉండదు. కథ నడుస్తూనే ఉంటుంది. కథలో పెయిన్ ఉంది. కానీ సిల్లీగా సాగే సిట్యువేషన్స్ వాటిని పలచన చేసేస్తూంటాయి.కథలో కొంతదూరం వెళ్ళాక..అసలు కథ ఎక్కడ మొదలైంది..అనే విషయం గుర్తు ఉండదు. పిల్లాడుకు ఒంట్లో బాగోలేదు..డబ్బులు కావాలి అనే పాయింట్ నే మర్చిపోతాం. అఫ్ కోర్స్ హీరో కూడా మర్చిపోతాడు. అయినా పిల్లాడి అనారోగ్యం విషయం చుట్టూ కామెడీ చేస్తే మనకు నవ్వు ఎక్కడ వస్తుంది. ఆ సెకను అక్కడ పండే జోక్ కి లేదా డైలాగుకు నవ్వు వచ్చినా ఫలితం ఏముంటుంది. పాయింట్ లోనే సిట్యువేషన్ కామెడీకు లీడ్ చేసే మెలిక ఉంటే వేరేగా ఉండేది. తెలంగాణా నేపధ్యం తీసుకోవటంతో ప్రెష్ గా అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. :
సత్తిగా జగదీష్ ప్రతాప్ బండారి పాత్రకు ప్రాణం పోసాడనే చెప్పాలి! అమాయకత్వం, జిత్తులమారితనం రెండు కలిపి చూపించాడు. 'వెన్నెల' కిశోర్ పాత్ర నవ్వించిందా అంటే ఫరవాలేదు అని చెప్పాలి. 'బిత్తిరి' సత్తి ఓకే. హీరో ప్రెండ్ పాత్రలో రాజ్ తిరందాసు చక్కగా నటించారు. గల్లీ బాయ్స్' రియాజ్ పాత్రకు తగినట్లు చేసారు. ఊరి సర్పంచ్ పాత్రలో మురళీధర్ గౌడ్ ఓకే.
టెక్నికల్ గా ..
తెలంగాణ పల్లెని అద్బుతంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి. జై క్రిష్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకుడు టార్గెట్ ఆడియన్స్ ని దృష్టి లో పెట్టుకుని చేసి ఉంటే ఆ స్లో నేరేషన్ తగ్గి, జోక్ లు పేలేవి. స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా రాసుకోవాలి. డైలాగులు బాగున్నాయి. చాలా చోట్ల పేలాయి.
బాగున్నవి?
అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్
క్లైమాక్స్
బాగోలేనివి?
ఊహించగలిగే కథ,కథనం
విసుగెత్తించే నేరేషన్
నవ్వించని కామెడీ సీన్స్
ఫైనల్ థాట్:
నాకు నచ్చిందా అంటే జస్ట్ ఓకే అని చెప్పాలి. కామెడీ కోసం అయితే ఈ సినిమాను చూడలేం. ఎప్పటిలాగే వాట్సప్,ఇనిస్ట్రా చూసుకుంటూ కాలక్షేపం కోసం ట్రై చేయచ్చు. ఆ రెండింటి మిక్సింగ్ బాగుండవచ్చు.
Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, ఆహా
నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, అనీషా దామ, వంశీధర్ గౌడ్, మోహన శ్రీ సురాగ, రాజ్ తీరందాస్, బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: జై క్రిష్
ఆర్ట్ : జి ఎమ్ శేఖర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్, నిఖిలేష్
రచన, దర్శకత్వం, ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండ
నిర్మాత: వై. రవి శంకర్, నవీన్ ఏర్నేని
Ott:AHa