`కర్ణ` మూవీ రివ్యూ.. రియలిస్టిక్‌ రివేంజ్‌ క్రైమ్‌ డ్రామా ఆకట్టుకుందా?

ఇటీవల కాలంలో సినిమాల్లోకి కొత్తగా వచ్చేవారు మంచి కంటెంట్‌తో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా కొత్త టాలెంట్‌, కొత్త వాళ్లు కలిసి చేసిన చిత్రం `కర్ణ`. కళాధర్‌ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటించడం విశేషం.  ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

karna movie review revenga drama hunting you arj

ఇటీవల కాలంలో సినిమాల్లోకి కొత్తగా వచ్చేవారు మంచి కంటెంట్‌తో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. `మేమ్‌ ఫేమస్‌`, `పరేషాన్`, `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి చిత్రాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కంటెంట్‌ బేస్డ్ గా వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుంది. తాజాగా కొత్త టాలెంట్‌, కొత్త వాళ్లు కలిసి చేసిన చిత్రం `కర్ణ`. కళాధర్‌ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటించడం విశేషం. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. యదార్థ సంఘటనలో వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 

కర్ణ(కళాధర్‌ కొక్కొండ) వరుస హత్యలు చేసి జైలు నుంచి బయటకు వస్తాడు. జైలు నుంచి విడుదలైనా కూడా హత్యలు చేయడం ఆపదు. వరుసగా తన స్నేహితులను, మోసం చేసే వారిని టార్గెట్ చేసుకుని హత్యలకు పాల్పడుతుంటాడు. అందులో భాగంగా ఓ మంత్రి కొడుకును కూడా చంపేస్తాడు. వరుస హత్యలు స్టేట్‌ని హడలెత్తిస్తుంటాయి. పోలీసులకు నిద్ర లేకుండా అవుతుంది. దీంతో కర్ణ కోసం పోలీసులు గాలిస్తుంటారు. తప్పించుకుని తిరుగుతున్న కర్ణ పోలీసులకు దొరికాడా? అసలు స్నేహితులను, మోసం చేసినవారిని మాత్రమే కర్ణ చంపడం వెనుక ఉన్న కారణమేంటి? తన చిన్ననాటి స్నేహితుడు పండు(మహేందర్‌) ఏమయ్యాడు? ప్రియురాలు ఫాతిమాతో ప్రేమ ఏ తీరం చేరిందా? అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన సినిమా. తెరపై చూసి తెలుసుకోవల్సిందే.
 
విశ్లేషణః

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. స్నేహానికి ద్రోహం చేస్తే చంపడానికి కూడా వెనుకాడని విధంగా కర్ణ ఎలా రాటు దేలాడు? అనే విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చెప్పడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు, కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం విఫలం అయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి బలంగా రాసుకుంటే బాగుండేది. క్రైమ్‌ థ్రిల్లర్‌లో నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది. అనుభవ లేమి కావచ్చు, కానీ చాలా వరకు ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని ఊహించగలిగేలా సన్నివేశాలుండటం సినిమాపై సస్పెన్స్ ని మిస్‌ చేస్తుంది.

‘చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం` అంటూ ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు. అందుకు తగ్గట్లే భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించాడు. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాపై అభిప్రాయాన్ని మార్చేస్తుంది. లవ్‌ స్టోరీ బాగుంది. చాలా సహజంగా అనిపిస్తుంది. కథగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మీద కూడా కొంత ఫోకస్ పెట్టి..పేరున్న నటీనటులతో తెరకెక్కిస్తే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది.

నటీనటులు, టెక్నీషియన్లుః 

కర్ణ పాత్రకు కళాధర్ కొక్కొండ న్యాయం చేశాడు. ఒకవైపు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపడుతూ..సినిమాలో నటించి, చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉందని చెప్పొచ్చు. ఇక హీరోయిన్‌గా మోనా ఠాకూర్‌ తన పాత్ర పరిధిమేర ఆకట్టుకుంది. ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ, ఆస్మా సయ్యద్ వంటి వారు ఫర్వలేదనిపించారు. ప్రశాంత్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. బ్యాక్‌ బోన్‌లా నిలిచింది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాలో హైలైట్‌ అయ్యాయి. ఎడిటర్‌ ఇంకా షార్ప్‌ చేయాల్సింది. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్‌గా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా `కర్ణ` రివేంజ్‌ డ్రామాల్లో మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. 

రేటింగ్‌ః 2.5

టైటిల్‌: కర్ణ
నటీనటులు:కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు తదితరులు
నిర్మాణ సంస్థ: సనాతన క్రియేషన్స్
నిర్మాత: కళాధర్‌ కొక్కొండ
దర్శకత్వం: కళాధర్ కొక్కొండ  
సంగీతం: ప్రశాంత్‌ బీజే
సినిమాటోగ్రఫీ: శ్రవణ్‌ జి కుమార్‌

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios