Asianet News TeluguAsianet News Telugu

ఆది సాయికుమార్‌ `సీఎస్‌ఐ సనాతన్‌` రివ్యూ..

 రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేస్తూ వచ్చిన యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ ఇప్పుడు రూట్‌ మార్చి థ్రిల్లర్‌ మూవీ చేశాడు.  `సీఎస్‌ఐ సనాతన్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. నూతన దర్శకుడు శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో బిగ్‌ బాస్‌ భామలు నందిని రాయ్‌, వాసంతి కృష్ణన్‌, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం శుక్రవారం(మార్చి 10)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

csi sanatan movie review did aadi sai kumar thrill you ?
Author
First Published Mar 10, 2023, 1:44 PM IST

సినిమాలకు సంబంధించి ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంటుంది. కానీ టైమ్‌లోనైనా థ్రిల్లర్‌ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఎంగేజ్‌ చేసే స్క్రీన్‌ప్లేతో, ట్విస్టులతో సాగే సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. తాజాగా అలాంటి కథాంశంతోనే ఆది సాయికుమర్‌ హీరోగా రూపొందించిన చిత్రం `సీఎస్‌ఐ సనాతన్‌`. నూతన దర్శకుడు శివశంకర్‌ దేవ్‌ రూపొందించిన చిత్రమిది. ఇందులో బిగ్‌ బాస్‌ భామలు నందిని రాయ్‌, వాసంతి కృష్ణన్‌, అలాగే నటులు అలీ రేజా, మధుసూదన్‌ రావు, తారక్‌ పొన్నప్ప ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం(మార్చి 10)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 

సనాతన్‌ (ఆది సాయికుమార్‌) పోలీస్‌ కావాలనుకుంటాడు. కానీ అనుకోని కారణాలతో ఎగ్జామ్‌ రాయలేకపోతాడు. దీంతో సీఎస్‌ఐ(క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌) కోర్స్ చేసి ఆ రంగంలో బెస్ట్ గా పేరుతెచ్చుకుంటాడు. ట్రైనింగ్‌లోనే కీలక కేసులు సాల్వ్ చేసి మంచి పేరుతెచ్చుకుంటాడు. ఆయనకు వీసీ ఫైనాన్స్ కంపెనీ సీఈవో విక్రమ్‌ చక్రవర్తి మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సి బాధ్యత పడుతుంది. విక్రమ్‌ చక్రవర్తి తన కంపెనీ ద్వారా పేదలకు సునా వడ్డీకే రుణాలిస్తుంటాడు. మరోవైపు తన కంపెనీలో రోజుకి పది రూపాయలు ఇన్వెస్ట్ చేసే స్కీమ్‌ పెడతాడు. దీనికి విశేష ఆదరణ లభిస్తుంది. అతి కొద్ది టైమ్‌లోనే ఫోర్బ్స్ లోనూ స్థానం సంపాదిస్తాడు. అలాంటి జనం కోసం మంచి చేసే కంపెనీ సీఈవో ఊహించని విధంగా హత్యకు గురి కావడంతో షాక్‌కి గురి చేస్తుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి వచ్చిన సనాతన్‌.. ప్రధానంగా ఆ కంపెనీలోనే ఐదుగురు ఎంప్లాయ్‌ని అనుమానితులుగా గుర్తిస్తాడు. కానీ ఎంతకు ఆ కేసు తేలదు, ఈ ఇన్వెస్టిగేషన్‌లో విక్రమ్‌ చక్రవర్తి పార్టనర్‌ దివ్య(నందిని రాయ్‌) ప్రధాన నింధుతురాలిగా భావిస్తారు. ఆమెని విచారించే క్రమంలో ఈ కంపెనీకి మంత్రి రాజవర్థన్‌కి(మధుసూదన్‌ రావు)కి సంబంధం ఉందని తెలుస్తుంది. మరి ఆయనకు విక్రమ్‌ చక్రవర్తికి సంబంధం ఏంటి? ఐదుగురు అనుమానితులెవరు? విక్రమ్‌ చక్రవరి మంచి వాడా? మోసగాడా? విచారణలో ఏం తేలింది? ఇంతకి ఆయన్ని చంపిందెవరు? సనాతన్‌ లవ్‌ స్టోరీ ఏంటీ? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణః

థ్రిల్లర్‌ సినిమాల్లో ప్రధానంగా ఉండేది మర్డర్‌ మిస్టరీ, సీరియల్‌ మర్డర్స్, సీరియర్‌ కిల్లర్‌ని పట్టుకోవడం. ఆల్మోస్ట్ కథ వీటి చుట్టూతే తిరుగుతుంది. కానీ దాన్ని నడిపించే విధానం ముఖ్యం. స్క్రీన్‌ప్లేని ఎంత ఎంగేజింగ్‌గా, ఎంత ట్విస్ట్ లతో నడిపిస్తారనేది కీలకం. ఎంతటి బ్రిలియంట్‌గా స్క్రీన్‌ ప్లే నడిపిస్తే అంతగా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటూ సినిమా సక్సెస్‌ అవుతుంది. ఇప్పుడు `సీఎస్‌ఐ సనాతన్‌` విషయంలో కొంత మేర వరకు దర్శకుడు దీన్ని రీచ్‌ అయ్యాడు. సినిమా మొత్తం విక్రమ్‌ చక్రవర్తి మర్డర్‌ చుట్టూ తిరిగినా, ఈక్రమంలో అసలు క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ గురించి, ఓ మర్డర్‌ జరిగినప్పుడు విచారణలో నిందితులను ఎలా కనిపెట్టాలి, క్లూస్‌ని ఎలా ఫైండౌట్‌ చేయాలనేదాన్ని డిటెయిలింగ్‌గా చూపించే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా వివరించి తీరుబాగుంది. చిన్న చిన్న ట్విస్ట్ లు బాగున్నాయి. మరోవైపు క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెట్‌. అందులో వచ్చే ట్విస్ట్ హైలైట్‌గా నిలుస్తుంది. అదే సినిమాకి బలంగా చెప్పొచ్చు. 

అయితే సినిమా చాలా వరకు హీరో ఇమేజ్‌, ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మరోవైపు కేసులో తికమక మాదిరిగానే వచ్చే సీన్లు కూడా కొంత తికమకపెడుతుంటాయి. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌లో ప్రతిదీ డీటెయిలింగ్‌గా చెప్పే క్రమంలో కొంత బోర్‌ తెప్పిస్తుంది. మరీ స్ఫూన్‌ ఫీడింగ్‌ చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. నేటి ఆడియెన్స్‌ టూ ఇంటలిజెంట్ గా ఉన్నారు, వారికి మరీ అరటి పండు ఒలిచిపెట్టాల్సిన అవసరం లేదు. అదే ఇందులో ఇబ్బంది పెట్టే అంశాలు. మరోవైపు కేసు ఇన్వెస్టిగేషన్‌ చేసే క్రమంలో ఫ్లాష్‌ బ్యాక్‌లకు వెళ్తూ, మరోవైపు తన లవ్‌ స్టోరీ చూపించడం కథ నుంచి కొంత ఆడియెన్స్ ని డైవర్ట్ చేసేలా ఉంటాయి. దీనికితోడు కథలో వేగం లేదు, స్లో నెరేషన్‌, కథ ఎంతసేపు అక్కడక్కడే తిరగడంతో చూసిన సీన్లే చూసినట్టుగా ఉండటం,  తర్వాత ఏం జరుగుతుందో అనే సీన్లు కొంత ఊహించేలా ఉండటం కూడా సినిమాకి మైనస్‌గా చెప్పొచ్చు. దర్శకుడి అనుభవ లేమీ స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేని మరింత క్రిస్పీగా రాసుకోవాల్సింది. మరింత ఎంగేజింగ్‌గా సినిమాని తెరకెక్కిస్తే నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేది. కానీ తొలి ప్రయత్నం ఫర్వాలేదని చెప్పొచ్చు. అయితే రిజల్ట్ పక్కన పెడితే ఇది క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి ఓ మంచి అవగాహణ కనిపించే చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు. 

నటీనటులుః

సనాతన్‌ పాత్రలో ఆది సాయికుమార్‌ బాగా చేశాడు. సినిమాని పూర్తిగా తన భుజాలపై వేసుకుని నడిపించారు. గత చిత్రాలతో ఇది కాస్త బెటర్‌ అని చెప్పొచ్చు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు. రెగ్యూలర్‌ మూవీస్‌కి బ్రేక్‌ వేస్తూ కొత్తగా ప్రయత్నం చేశాడు. హిట్‌ జోనర్‌తో వచ్చి తనవంతు మెప్పించే ప్రయత్నం చేశాడు. యాక్షన్‌ సీన్లలోనూ అదరగొట్టాడు. స్టార్‌ హీరోల రేంజ్‌లో ప్రయత్నించి ఆకట్టుకున్నాడు. ఇక దివ్యా పాత్రలో నందిని రాయ్‌ గ్లామర్‌ ట్రీట్ ఇచ్చింది. ఆమె పాత్రలో ట్విస్ట్ బాగుంది. మరోవైపు రాజవర్థన్‌గా మధుసూదన్‌ రావు, విక్రమ్‌ చక్రవర్తిగా తారక పొన్నప్ప మెప్పించారు. వీరితోపాటు మిషా నారంగ్‌, అలీ రేజా, వాసంతి, శివ, ఖయ్యూమ్‌ ఇతర పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. ఉన్నంతలో మెప్పిస్తాయి. అయితే ఇందులో మీడియా మిత్రులు కుమార్‌, సురేష్‌, నాగేశ్వరరావు, బాబురావు మెరవడం కొసమెరుపు. 

టెక్నీషియన్లుః 

దర్శకుడు శివ శంకర్‌ దేవ్‌ దర్శకుడిగా తొలి ప్రయత్నం బాగుంది. కానీ తన ఇంపాక్ట్ చూపించేలా చేస్తే ఇంకా బాగుండేది. లాజిక్‌లపై దృష్టిపెట్టి, ఎంగేజింగ్‌గా కథని చెప్పాల్సింది. ఆ విషయంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు. కాకపోతే ఇన్‌ఫార్మెటిక్‌గా సినిమాని తీసిన తీరు బాగుంది. అనీష్‌ సోలోమన్‌ సంగీతం బాగుంది. థ్రిల్లర్‌ చిత్రాలకు ఉండాల్సినట్టుగా ఉంది. కెమెరావర్క్ మెప్పించేలా లేదు. చాలా సీన్లు కట్‌ కట్ లాగా ఉంటాయి. క్లారిటీ మిస్‌ అయ్యింది. ఇక ఎడిటర్‌ ఇంకా ట్రిమ్‌ చేయాల్సింది. చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios