`అరంగేట్రం` మూవీ రివ్యూ అండ్ రేటింగ్..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఐదేళ్ల క్రితం `కవచం` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ ప్రభన్(శ్రీనివాస్ మామిళ్ల). దర్శకుడిగా మరో ప్రయత్నం చేశాడు. తనే హీరోగా నటిస్తూ `అరంగేట్రం` అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది రేపు(మే 5న)శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఐదేళ్ల క్రితం `కవచం` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ ప్రభన్(శ్రీనివాస్ మామిళ్ల). కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. ఈ నేపథ్యంలో కొత్త నటీనటులతో దర్శకుడిగా మరో ప్రయత్నం చేశాడు. తనే హీరోగా నటిస్తూ `అరంగేట్రం` అనే సినిమాని తెరకెక్కించాడు. ఇది రేపు(మే 5న)శుక్రవారం విడుదల కానుంది. ముందుగానే ప్రీమియర్‌గా ప్రదర్శించారు. సైకో మర్డర్ మిస్టరీగా, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఓ సైకో(ముస్తఫా అస్కరి) వరుసగా అమ్మాయిలను చంపుతుంటాడు. అది కూడా ప్రతి ఏడాది ఓ పర్టిక్యూలర్ డేట్‌కి చంపేస్తుంటాడు. దీంతో వరుస మరణాలు జనాలను భయందోళనకు గురి చేస్తుంటాయి. ఆ సైకోని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తారు. సైకో నెక్ట్స్ టార్గెట్ వైష్ణవి అనే అమ్మాయి. కట్ చేస్తే శ్రీనివాస్ ప్రభన్.. ఓ మంచి పెయింటర్. ఆయన పెయింటింగ్ చూస్తే ఇది నిజమే అన్నట్టుగా ఉంటుంది. పెయింటింగ్ వేసుకునే ప్రభన్.. సైకో హత్యల గురించి తెలుసుకుని వైష్ణవిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. వైష్ణవిని బయటకు పంపి ఆ ఇంట్లోకి తను వెళ్తాడు. ఆ ఇంట్లోకి వచ్చిన వైష్ణవి అక్క, బావలు.. ప్రభన్‌ని చూసి సైకో అనుకుంటాడు. తన లవర్ కోసం ఆమె భర్తని చంపేందుకు వచ్చిన కుర్రాడు కూడా ఇతనే సైకో అని భావిస్తారు. అతని చేతిలో దెబ్బలు తిని బంధీలుగా మారతారు. ఓ లేడీ జర్నలిస్ట్ మాత్రం ప్రభన్‌ని కొట్టి బంధిస్తుంది. కానీ ఆ తర్వాత నిజంగానే సైకో ఆ ఇంటికి వస్తాడు. ఆ లేడీ జర్నలిస్ట్ ని కొట్టి బంధిస్తాడు. దీంతో ఆ ఇంట్లో ఐదుగురు సైకో చేత బంధించబడతారు. వారిని చంపే ముందు తాను ఎందుకు హత్యలు చేస్తున్నాడో రివీల్ చేస్తాడు. మరి తను ఎందుకు సైకోలా మారాడు? అమ్మాయిలనే ఎందుకు చంపుతున్నాడు? ప్రభన్.. ఎందుకు సైకోని ఆపాలనుకుంటాడు? ప్రభన్ లవ్ స్టోరీ ఏంటి? అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
మర్డర్ మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మంచి ఆదరణ పొందుతున్నాయి. సినిమాని ఎంగేజింగ్, ఎంటర్‌టైనింగ్‌గా చెబితే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. మర్డర్ మిస్టరీలతో కూడిన థ్రిల్లర్‌కి కథ పెద్దగా కొత్తగా ఉండదు, అటు ఇటుగా ఒకేలా ఉంటాయి. కానీ ట్విస్ట్ లు, ముఖ్యంగా.. కథని బోర్ తెప్పించకుండా తెరకెక్కించడం, ఆడియెన్స్ డైవర్ట్ కాకుండా కథనాన్ని నడిపించడం మరీ ముఖ్యం. వీటిలో సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్టే. అయితే `అరంగేట్రం`లో కథ పరంగా దర్శకుడిగా శ్రీనివాస్ ప్రభన్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అలాగే ఆర్టిస్టుల సెలెక్షన్ పరంగా ఇంకో అడుగు ముందుకు వేయాల్సింది. అయినప్పటికీ బలమైన కథకి తమవంతు న్యాయం చేశారని చెప్పొచ్చు. అందుబాటులో ఉన్న ఆర్టిస్టులతోనైనా కథని ఆడియెన్స్ వరకు చేర్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ కథకు బలమైన ఆర్టిస్టులు ఉండుంటే లెక్క వేరేలా ఉండేది.
ఓ బలమైన కథని రాసుకున్నాడు దర్శకుడు. ట్విస్టులు, టర్న్ లు, మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్, ఎలివేషన్ సీన్లు ఇలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు. వాటిని క్యారీ చేసే ఆర్టిస్టులను ఎంపిక చేయలేకపోయారనేది తెలుస్తోంది. అయినా బెస్ట్ అవుట్ పుట్ అందించే ప్రయత్నం చేశారు. బడ్జెట్ సమస్యనా? పెద్దవాళ్లు నటించేందుకు ఆసక్తి చూపలేదా?.. కారణం ఏదైనా ఈ సినిమా కథ అడవి శేష్ లాంటి హీరో చేతిలో పడితే సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక దర్శకుడే హీరోగా మారి తనవంతుగా ఆ పాత్రని క్యారీ చేసే ప్రయత్నం చేశాడు. అయతే తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకునే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు.
సినిమా పరంగా దర్శకుడు ఎలివేషన్లకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దీనికితోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగ్గొట్టారు. ఓ పెద్ద సినిమా రేంజ్‌లో ఉంది. అదే సినిమాని ఎంగేజింగ్‌గా మార్చింది. మరోవైపు ఇంట్లో వరుసగా సైకో కోసం వచ్చి ఇరుక్కుపోవడం, ఈ క్రమంలో వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఎంటర్‌టైనింగ్‌గా సాగుతాయి. ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే ట్విస్ట్, సైకో మిగిలిన వారితో ఆడే ఫజిల్ గేమ్, క్లైమాక్స్ కి ముందు నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, లవ్ సాంగ్ సహజంగా అనిపించదు. అయితే, అనుభవజ్ఞులైన నటీనటులు ఎంపికై ఉండి, దర్శకుడు మరింత గ్రిప్పింగ్‌గా సినిమాని తెరకెక్కించి ఉంటే కచ్చితంగా పెద్ద రేంజ్ సినిమా అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
నటీనటులుః
హీరోగా దర్శకుడే నటించాడు. దర్శకుడు హీరోగా చేయడం కష్టం. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మరో నోటెడ్ హీరో హ్యాండివ్వడంతో తనే హీరోగా మారాల్సి వచ్చిందట. దర్శకుడిగా మెప్పించడమే కాకుండా.. హీరోగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయా సీన్స్ లో కాస్తా ఇబ్బంది పడినా బెస్ట్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం కనిపించింది. ప్రధాన పాత్రకు తనవంతు న్యాయం చేశాడు. ఇక హీరో లవర్ మేఘనగా పూజా కూడా తన పాత్రలో మెప్పించింది. పెర్ఫామెన్స్ పరంగా ఓకే అనిపించింది. సైకో పాత్రలో ముస్తఫా అస్కరీ సినిమాకి పెద్ద ప్లస్. తను బాగా చేశాడు. తన చిన్ననాటి పాత్రలో మాస్టర్ రోషన్ ఇరగదీశాడు. అతను ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
సినిమాకి సంగీతం, బీజీఎం హైలైట్‌గా నిలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ కట్టా మంచి ఆర్‌ఆర్ అందించారు. సినిమాని ఎంగేజింగ్‌గా నడిపించాడు. బురాన్ షేక్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యింది. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి. సినిమాపై వారికున్న ప్యాషన్ కనిపిస్తుంది. ఇక దర్శకుడిగా శ్రీనివాస్ ప్రభన్‌కి మెప్పించాడు. మర్డర్, సస్పెన్స్, థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. అయితే ఇలాంటి చిత్రంలోనూ ఎంటర్ టైన్‌మెంట్‌ని పెట్టడం, దాన్ని కన్విన్స్ గా చూపించడం పెద్ద హైలైట్. నటీనటుల నటన కంటే ట్విస్టులు, టర్న్ రివీల్ అయిన తీరు బాగుంది. అవి సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. అయితే సినిమాని మరింత గ్రిప్పింగ్‌గా, మరింత ఎంగేజింగ్‌గా, సహజంగా తీసి ఉంటే కచ్చితంగా ఇది మంచి సినిమాగా నిలిచేది. అయినప్పటికీ ఇదొక అభినందనీయ ప్రయత్నంగా చెప్పొచ్చు.
రేటింగ్‌ః 2.5
నటీనటులు: శ్రీనివాస్ ప్రభన్, పూజా, లయ, రోషన్, ముస్తఫా అస్కరి, తిరుపతి తదితరులు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస ప్రభన్
నిర్మాత: మహేశ్వరి, విజయలక్ష్మీ( సహ నిర్మాత)
మ్యూజిక్ డైరెక్టర్: గిడియన్ కట్టా
సినిమాటోగ్రఫి: బురాన్ షేక్(సలీమ్)
ఎడిటర్: మధు
స్టంట్స్: స్టార్ మల్లి
ఆర్ట్: సురేష్ ఆర్
కో - డైరెక్టర్ , ప్రొడక్షన్ డిజైనర్ : రమేష్ బాబు చిన్నం(గోపి)
బ్యానర్: మహి మీడియా వర్క్స్