స్త్రీల లైంగిక విషాద గాథలు- స్టోమా
‘గీతాంజలి’ కలం పేరుతో తను రాసిన ఆమె అడవిని జయించింది, బచ్చేదాని, పహేచాన్, పాలమూరు వలసల బతుకు చిత్రాలు, శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం, హెస్బెండ్ స్టీచ్-1 అత్యంత పాఠకదారణ పొందాయి.
డా. భారతి (గీతాంజలి) గారు వృత్తి రీత్యా సెక్సాలజిస్ట్ & సైకోథెరపిస్టు గా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తూ తన దృష్టికి వచ్చిన స్త్రీల లైంగిక హింసలను రచనల రూపంలో అందిస్తూ, ఇంతటి హింస నిజంగా ఉంటుందా! అని ఆశ్చర్యపరిచే సంఘటనలను భాదితులకు తప్ప సమాజానికి పట్టని మానసిక హింసలు తన రచనల్లో చదువుకోవచ్చు. ‘గీతాంజలి’ కలం పేరుతో తను రాసిన ఆమె అడవిని జయించింది, బచ్చేదాని, పహేచాన్, పాలమూరు వలసల బతుకు చిత్రాలు, శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం, హెస్బెండ్ స్టీచ్-1 అత్యంత పాఠకదారణ పొందాయి. గ్లోబలైజేషన్ కు, సెజ్ లకు వ్యతిరేఖంగా పాలమూరు లేబర్ వలస కథలను, కమ్యునల్ వాయిలెన్స్ వ్యతిరేక కథలను గుజరాత్ 2002 జాతి హత్యాకాండ నుంచి ఇప్పటి RSS ప్రేరిత బీజేపీ పాలక వర్గాలు ముస్లింలు,దళితుల మీద జరుపుతున్న హత్యలను సమకాలీన రాజకీయార్థిక కోణం నుంచి విశ్లేషణతో రాశారు. మొత్తం కథలన్నీ రచయిత్రి దగ్గర కౌన్సిలింగ్,మారిటల్ థెరపీ తీసుకున్న స్రీల భయంకరమైన విషాద, లైంగిక గాథలే.
ఈ కథలు చదువుతుంటే ఓషో గారు పెళ్లి గురించి అన్నటువంటి "Marriage is a legalized prostitution" మాటోకోటి గుర్తొస్తుంది. అవును నిజమే ప్రస్తుతం పెళ్లి పేరు మీద జరిగే వ్యాపారాలను చూస్తుంటే పై మాటను ఒప్పుకోక తప్పదు. మ్యాట్రిమోనీలు వధూవరుల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. అటు తర్వాత జరిగే అన్ని తంతులన్ని డబ్బుతో ముడిపడినవే..! ఇద్దరి ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ఆర్ధిక హోదా, కులం అనేవి వాళ్ళను బలవంతపు సమాజ ఆమోదిత వ్యభిచారం లోకి నెట్టివేస్తాయి. వాళ్ళు సెక్సవల్ గా సంతృప్తి చెందారా సాఫీగా సాగిపోతుంది లేదంటే మరుసటిరోజు నుండి ఎవ్వరికి చెప్పుకోలేని కష్టాలు వారిలో అలుముకుంటాయి. ఉద్యోగం, కెరీర్ లపై ఇవి ఎంతగానో ప్రభావం చూపి 'పరువు' అనే పదంతో జీవితాలు బరువెక్కుతాయి. తల్లిదండ్రులు, పిల్లలు తప్పక చదవాల్సిన 'తాపీ ధర్మారావు' గారి 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' అనే పుస్తకం లో పెళ్లి యొక్క ఆవశ్యకతను చాలా చక్కగా వివరించారు.
Also Read: గీతాంజలి తెలుగు కథ: స్టోమా
'మా నాన్నెందుకు మంచోడంటే..!' అనే మొదటి కథలో అభ్యుదయ భావాలు కల్గిన ప్రభాకర్ అనే బ్రాహ్మణ యువకుడు, దళిత యువతిని పెళ్లి చేసుకుని మడి ఆచారాన్ని పాటించే అమ్మతో ఉంటూ, సెక్స్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్న ముస్లిం యువతికి పుట్టి, చిల్డ్రన్ హోమ్ లో లైంగిక హింసకు గురవుతున్న ఫలక్ అనే పాపను దత్తత తీసుకుంటాడు. పసి పిల్లలని కూడా చూడకుండా చిల్డ్రన్ హోమ్ లో జరిగే అత్యాచారాలకు అలవాటుపడి, కలలో సైతం ఉలిక్కిపడి, ఫలక్ చేసే వింత చేష్టలకు నిష్చేష్టులై సైకాలజీకల్ కౌన్సిలింగ్ ఇప్పించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్గించి పసి హృదయంపై పడిన దుష్ప్రభావాన్ని తొలగించిన కథలో అభం శుభం తెలియని పిల్లలపై జరిగే లైంగిక అత్యాచారాలను చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాలపై అసహ్యం వేస్తుంది. రెండవ కథ 'కర్ర' లో రామనాథం అనే వ్యక్తి బతుకుదెరువు కై బయటి దేశాలకెళ్ళి చెడు తిరుగుళ్లకు మరిగి అనారోగ్యం పాలైనా, సకల సపర్యలు చేస్తూ, తన రెక్కల కష్టంతో ఎదిగిన పిల్లలను చదివిస్తూ, ఇల్లు గడుపుతున్న భార్య కళావతి ని నిత్యం అనుమానిస్తూ, అసహ్యంగా ఒళ్ళంతా రసికారే పుండ్లతో, సొంగలు కారే తన పెదాలతో ముద్దు పెట్టాలని భార్యను బలవంతపెడుతూ,నన్ను అసహ్యించుకుంటున్నావ్ ఎవరెవరి దగ్గర పంతున్నవే అనే సూటిపోటి మాటలే కాదు, పక్షపాతానికి గురై కర్ర సాయంతో నడుస్తూ అదే కర్రతో దగ్గరికి లాక్కొని ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకా కళావతి తమ్ముడితో కూడా మీ అక్క లంజదిరా అనే అసహ్య పదజాలంతో నా దగ్గరికి రావడంలేదని అవమానంగా మానసిక హింసకు గురిచేసిన తీరు, రామనాథం కు ఉన్న అంటురోగాల చిట్టా డాక్టర్ ద్వారా తెలుసుకొని అదే కర్రతో కళావతి తిరగబడిన తెగువ పాఠకులను ఆలోచిపజేస్తుంది.
ఖత్నా' అనే ఆచారం పేరు మీద ముస్లిం స్త్రీల మీద జరిగే లైంగిక దాడిని, ఆ దూరచారాన్ని వివరించిన తీరు ఇంతటి క్రూరమైనవి ఇంకా కొనసాగుతున్నాయా..! అనే దిగ్భ్రాంతికి లోనువుతాము. యుక్త వయస్సుకు రాగానే సంపూర్ణ స్త్రీగా మార్చే మూఢచారంలో భాగంగా పవిత్రతను అపాదించి సాటి అడవాళ్లే రాక్షసంగా రెండు కాళ్ళ మధ్య రేజర్ బ్లేడ్ లతో 'హరాంకి బోటి' పాపపంకిలమైన మాంసపు తునుకను తొలగించి ఇజ్జత్ దార్ ఔరత్ బన్ గయే అంటూ స్వీట్లు పంచుతూ, కొత్త బట్టలు, డబ్బులతో చేసే కార్యం అత్యంత క్రూరమైంది. టీనేజ్ లో కేవలం మూత్రం పోయాడానికి, నెలసరి కి సరిపోయేంత రంద్రాన్ని వదిలి మిగతా భాగాన్ని కుట్టేస్తారు, పెళ్లి అయిన తర్వాత శోభనానికి ముందు 'ఖోల్ నా ' తెరువాలి అంటూ ఆసుపత్రికి తీసుకెళ్లి మళ్ళా అదే ప్రాంతంలో కుట్లు విప్పి పంపిస్తారు. తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణానికే ప్రమాదం జరిగే తీరు కలిచివేస్తుంది. యాస్మిన్ అనే యువతికి ఖత్నా జరిపి పెళ్లికి ముందు రంద్రాన్ని తెరిచి పిల్లలు పుట్టాక మరలా మూసినా సంసార సుఖానికి పనికిరావని భర్త చేతిలో మానసిక, శారీరక హింసకు గురై "యా ఖుదా.. ఔరత్ కీ జిందగీ మే ఇత్నా జెహర్ ఔర్ దర్ద్ క్యో భరా.. ఖురాన్ మే భీ నహీ లీఖాసో ఏ లోగ్ క్యోం కర్రై.." అంటూ తన గోడును అల్లాకు మొరపెట్టుకుంటుంది. తన బిడ్డకు మాత్రం ఈ తంతును చేయొద్దని నిశ్చయించుకున్న యాస్మిన్ అవసరమైతే భర్తపై డాక్టర్ పై కేసు వెయ్యడానికి సిద్ధమై ఆచారం పై తిరుగుబాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది.
'స్టోమా' గాథలో తులసికి పద్నాలుగేళ్ల వయస్సులో రామనాథంతో పెళ్లవుతుంది, రియలేస్టేట్ వ్యాపారంతో వైవాహిక జీవితాన్ని మొక్కుబడిగా సాగించినా ముగ్గురు ఆడపిల్లలు మగ పిల్లడికోసం మధ్యలో రెండు అబార్షన్ లతో అలిసిన తనువుకు, పిల్లల పెళ్లిలై మనువలు మనువరాళ్లతో గడపాల్సిన యాభై ఐదేళ్ల వయ్యసులో, జీవితాన్ని, యుక్త వయస్సును సంపాదనకోసం ధారపోసిన భర్తకు సెక్స్ జీవితంపై వ్యామోహం పెరుగుతుంది. భార్యను 'నీ దేహం అంతకు ముందులాగా లేదు. లూసు అయిపోయావు' అంటూ మానసికంగా వేధిస్తే హస్బెండ్ స్టిచ్ వేయించుకుంటే అది ఫెయిల్ అయ్యి ఆమె మల ద్వారాన్ని మూసేసి బయట వైపు పొట్ట కి రంధ్రం చేసి ...పేద్ద పేగుల నుంచి మలం ..పొట్టకి చేసిన స్టోమా అనే రంధ్రం ద్వారా దానికి అమర్చిన యూరోబాగ్ లాంటి ,మలాన్ని బయటి వైపు మోసే స్టోమాబాగ్ లో చేరుతుంది.దీన్ని రోజు ఆమె క్లీన్ చేసుకొని, స్టోమా రంధ్రాన్ని కూడా క్లీన్ చేసుకొని,కొత్త స్టోమా బాగ్ అమర్చుకోవడం, ఇంట్లో అందరి నించి అసహ్యాన్ని భరించడం, అవమానం..బహిష్కరణ,అంటరానితనాన్ని అనుభవించడం తో పాటుగా ,ఆ స్టోమా బాగుతో శారీరిక,మానసిక హింసను అనుభవిస్తున్న ఆమె మీద ఆమె భర్త సెక్స్ కోసం వేధించడం,లైంగిక అత్యాచారం చేయడం...దాన్ని ఆమె ఎదుర్కొన్న,నిరసన ప్రకటించిన తీరు విభ్రమని , అత్యంత దుఃఖాన్ని కలిగిస్తుంది కథ చదువుతున్న పాఠకులకి.
సమ్మతి, ది కిస్-2, చచ్చిన పాము!, దోఝక్, పెద్ద బాలశిక్ష, ఆక్సిజన్, అనెస్తేషీయా.., చావు అనే అన్ని కథల్లో స్త్రీల లైంగిక గోడును అక్షరికంచిన విధానం, తన రచనల్లోని గాఢత మనకు తెలుస్తుంది. భార్య సమ్మతి లేకుండా శ్రుగారంలో పాల్గొన్నా సెక్షన్ 375 ప్రకారం నేరమే అవుతుంది అని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది, అయినప్పటికి స్త్రీలకు ఆర్ధిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా చేసి బానిసలుగా మార్చుకొని, లైంగిక హింసకు గురిచేస్తున్నారు. తరాలుగా సాగుతున్న హింసాకాండను ఎదుర్కోవడానికి స్త్రీలు చట్టాలపై అవగాహన పెంచుకొని న్యాయ బద్దంగా తిరుగుబాటు చేయాలే కానీ, హింసను భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఇది పురుషులందరు పెళ్లికి ముందు, పెళ్లి తరువాత చదవాల్సినటువంటి సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ అందించే కథలున్న పుస్తకం.
పుస్తకం కోసం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో సంప్రదించగలరు…..
- ముఖేష్ సామల